అండర్-23 వన్డే స్టేట్ ఎ టోర్నీలో స్టార్ బ్యాట్స్‌మెన్ సమీర్ రిజ్వీ చెలరేగాడు. బుధవారం (డిసెంబర్ 25) నాటికి 8 రోజుల్లో రెండు డబుల్ సెంచరీలు చేశాడు. అంతేకాకుండా.. 2 శతకాలు కూడా బాదాడు. వడోదరలోని జిఎస్‌ఎఫ్‌సి క్రికెట్ గ్రౌండ్‌లో ఉత్తరప్రదేశ్, విదర్భ మధ్య మ్యాచ్ గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విదర్భ.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 406 పరుగులు చేసింది. డానిష్ మలేవార్ 142 పరుగులు చేయగా, కెప్టెన్ మహ్మద్ ఫైజ్ 100 పరుగులు చేశాడు.
లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్ 41.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 409 పరుగులు చేసి విజయం సాధించింది. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన యూపీ కెప్టెన్ సమీర్ రిజ్వీ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. సమీర్ రిజ్వీ 105 బంతుల్లో 10 ఫోర్లు, 18 సిక్సర్ల సాయంతో 202 పరుగులు చేశాడు. సమీర్ రిజ్వీ నాలుగు రోజుల క్రితం వడోదరలోని కోటంబి బి మైదానంలో త్రిపుర అండర్-23తో జరిగిన మ్యాచ్‌లో మరో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 97 బంతుల్లో 201 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో 13 ఫోర్లు, 20 సిక్సర్లు బాదాడు. టోర్నీలో ఇదే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ.
Read Also: Iqra Hasan: ఇమ్రాన్ ప్రతాప్‌గఢీతో పెళ్లిపై ఎస్పీ మహిళా ఎంపీ ఏమన్నారంటే..!
అంతకుముందు హిమాచల్ ప్రదేశ్‌పై (19 డిసెంబర్ 2024) 153 పరుగులు, పాండిచ్చేరిపై (17 డిసెంబర్ 2024) 137 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అండర్-23 టోర్నీలో 6 ఇన్నింగ్స్‌ల తర్వాత సమీర్ రిజ్వీ ఖాతాలో 728 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అతను 52 ఫోర్లు, 64 సిక్సర్లు కొట్టాడు. గత ఎడిషన్‌లోనూ ఉత్తరప్రదేశ్ అండర్-23కి స్టార్‌గా నిలిచాడు. గతేడాది ఫైనల్లో ఉత్తరప్రదేశ్ విజయంలో సమీర్ రిజ్వీ కీలక పాత్ర పోషించాడు. 50 బంతుల్లో 83 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో కూడా ఉత్తరప్రదేశ్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే.. సమీర్ రిజ్వీ విజయ్ హజారే ట్రోఫీకి జట్టులో ఎంపిక కాలేదు. అతను విజయ్ హజారే ట్రోఫీ జట్టు నుండి తొలగించబడటానికి ముందు 8 ఇన్నింగ్స్‌లలో 136 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ మెగా వేలానికి ముందు అతన్ని విడుదల చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో సమీర్ రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 95 లక్షలకు కొనుగోలు చేసింది. సమీర్ రిజ్వీ బేస్ ధర రూ.30 లక్షలు. అయితే ఇప్పటి వరకూ అద్భుత ప్రదర్శన కనబరిచిన సమీర్ రిజ్వీ.. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు పరుగుల వరద పారించనున్నాడు.