కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ-సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా హసన్ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం నెట్టింట వార్తలు వైరల్ కావడంతో సమాజ్‌వాదీ ఎంపీ ఇక్రా హసన్ స్పందించారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌గఢీతో వివాహ పుకార్లను ఇక్రా హసన్ ఖండించారు. ప్రస్తుతానికి తనకు వివాహం చేసుకునే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అలాంటి వార్తలను వ్యాప్తి చేసేవారిపై ధ్వజమెత్తారు. ఏ వ్యక్తి గురించి అయినా.. ముఖ్యంగా ఒక మహిళ గురించి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రసారం చేయడం తప్పు అని ఇక్రా అన్నారు. ప్రస్తుతం తాను కైరానా నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయడంపైనే దృష్టి పెట్టినట్లు ఆమె స్పష్టం చేశారు. ఇతర పనులకు ప్రస్తుతం తన దగ్గర సమయం లేదన్నారు. పెళ్లి వార్తలు కుటుంబ సభ్యుల్ని ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. అయినా ఇలాంటి తప్పుడు వార్తలు ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఇక్రా హసన్ దుయ్యబట్టారు.
ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు. ఉర్దూ భాషా కవి. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా జూన్ 11న ఎన్నికయ్యారు. ప్రతాప్‌గఢీ 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2021 జూన్ నెలలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ డిపార్ట్‌మెంట్ ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు.