Tiger Attack: అసోంలోని జోర్హాట్ జిల్లాలో సోమవారం చిరుతపులి బీభత్సం సృష్టించింది. అటవీ ప్రాంతంలోని ఇనుప కంచె దాటుకుని జనావాసాల్లోకి వచ్చింది చిరుత పులి. కనపడిన వాళ్లపైన దాడికి దిగింది. ఈ ఘటనలో ముగ్గురు అటవీ సిబ్బందితో సహా 13 మంది గాయపడినట్లు అటవీ అధికారి తెలిపారు. అందులో ఒకరిపరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలోని చెనిజాన్ ప్రాంతంలోని రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌ఎఫ్‌ఆర్‌ఐ) క్యాంపస్‌లో తెల్లవారుజాము నుంచి చిరుత సంచరిస్తోంది. దీంతో క్యాంపస్‌లోని నివాసితులు అటవీ శాఖకు సమాచారం అందించారు.
Read Also: Dengue Alert : ఓ పక్క కరోనా.. మరోపక్క డెంగీ.. రాజధాని ఉక్కిరిబిక్కిరి
చిరుతను పట్టుకోవడానికి ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పెద్ద పులి క్యాంపస్‌లోని 10 మంది నివాసితులు, ముగ్గురు అటవీ సిబ్బందిపై దాడి చేసింది. అనంతరం ఆ ప్రాంతం నుండి పారిపోయింది. చిరుతపులిని శాంతింపజేసేందుకు అటవీ సిబ్బంది అనేక ప్రయత్నాలు చేశారని, అయినా అది ఇంకా పరారీలో ఉందని, దానిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఆర్‌ఎఫ్‌ఆర్‌ఐ చుట్టూ ఎకరాల కొద్దీ అడవులు ఉండడంతో చిరుతపులి అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చిరుత దాడికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది.