కరోనా టీకా వేసుకున్న తర్వాత దాని దుష్ప్రభావాల వల్ల తెలంగాణలో 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కరోనా టీకా ప్రారంభమైన 2021 జనవరి 16 నుంచి ఈ ఏడాది మార్చ్ 15వ తేదీ వరకు సంభవించిన మరణాలు, టీకా తర్వాత జరిగిన దుష్ప్రభావాలపై ఒక నివేదికను వెల్లడించింది. నివేదిక ప్రకారం టీకా తర్వాత దుష్ప్రభావాల కారణంగా దేశంలో 92,479 మంది ఆస్పత్రుల పాలయ్యారు. అందులో తెలంగాణలోనే 10,370 మంది ఆస్పత్రుల్లో చేరారు.
Also Read : UPI Transaction Limit: ఫోన్ పే, గూగుల్ పేలో రోజూ రూ.లక్షల్లో పంపుతామంటే కుదరదు
ఈ తరహా కేసుల్లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా.. మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో 10,513 ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్ లో 10,127 ఘటనలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ మూడు రాష్ట్రాల్లోనే పదివేలకు పైగా ఇటువంటి ఘటనలు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 8,212, పశ్చిమబెంగాల్ లో 8,130, కర్ణాటకలో 6,628, మంది ఆస్పత్రుల పాలయ్యారు. కాగా.. టీకా అనంతరం దేశంలో మొత్తం 1,156 మంది మరణించారు. అందులో అత్యధికంగా కేరళలో 244 మంది మృతి చెందారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 102, ఉత్తరప్రదేశ్ లో 86 మంది మరణించారు. మధ్యప్రదేశ్ లో 85, కర్ణాటకలో 75, పశ్చిమబెంగాల్ లో 70 మంది, తెలంగాణలో 37 మంది మరణించారు. కాగా ఛత్తీస్ గఢ్ లో ఒకరే మరణించారు.
Also Read : Astrology : ఏప్రిల్ 3, సోమవారం దినఫలాలు
భారత్ లో ఇప్పటి వరకు కోట్లాది మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. అందులో కరోనా టీకా వేసుకున్న ప్రతీ 23 వేల మందిలో ఒకరు ప్రతికూల ప్రభావాలతో ఆస్పత్రుల్లో చేరారు. తెలంగాణలో ఇప్పటి వరకు 3.24 కోట్ల మంది కరోనా టీకా మొదటి డోసు వేసుకున్నారు. ఇందులో 3.15 కోట్ల మంది రెండో డోసు.. అలాగే 1.35 కోట్ల మంది బూస్టర్ డోసు తీసుకున్నారు. మొత్తం మూడు డోసులు కలిపి 7.75 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. కాగా రాష్ట్రంలో టీకా తీసుకున్నవారిలో 37 మంది మరణించారు.
Also Read : Marvel Cinematic Universe: సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్-5 నుంచి ఫస్ట్ సీరీస్…
ఇప్పటి వరకు దేశంలో 220 కోట్ల టీకా డోసులు ఇచ్చారు. అంటే ప్రతి 19.03 లక్షల డోసులకు ఒక మరణం సంభవించింది. తెలంగాణలో ప్రతీ 20.96 లక్షల డోసులకు ఒక మరణం సంభవిచింది. వీటి దుష్ప్రభావాలతో ఆస్పత్రుల్లో చేరిన తర్వాత జరిగిన మరణాలుగానే ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాని కరోనా వ్యాక్సిన్ వల్లే నేరుగా సంభవించిన మరణాలుగా ప్రకటించలేదని నిపుణులు అంటున్నారు. కోవిడ్ వ్యాప్తి తీవ్రతతో సంభవించిన మరణాలతో పోలిస్టే టీకా అనంతర మరణాలు చాలా స్వల్పమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో 8.42 లక్షల మందికి కరోనా సోకగా.. అందులో 8.38 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా అధికారికంగా 4,111 మంది చనిపోయారు.