Party Funds: గుర్తు తెలియని మూలల నుంచి వచ్చే విరాళాల్లో ప్రాంతీయ పార్టీల్లో వైఎస్సార్ సీపీ దేశంలోనే టాప్ లో నిలిచింది. మొత్తం 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన గుప్త నిధుల్లో ప్రాంతీయ పార్టీల్లో వైసీసీ మొదటిస్థానంలో ఉంది. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బయటపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2004-05 నుంచి 2020-21 మధ్య అన్ని జాతీయ పార్టీలకు కలిపి రూ. 15,077 కోట్ల గుప్త నిధులు వచ్చినట్లు నివేదిక వెల్లడించింది. 2020-21లో ఈ పార్టీలన్నింటికీ కలిపి రూ. 690.67 కోట్లు విరాళాలుగా వచ్చినట్లు వెల్లడించింది. 2004-05,2020-21 మధ్య కాలంలో ఆయా పార్టీలు ఫైల్ చేసిన ఆదాయపన్ను వివరాలను ఆధారంగా చేసుకుని ఈ నివేదిక రూపొందించినట్లు ఏడీఆర్ తెలిపింది.
8 జాతీయ పార్టీలకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో గుర్తు తెలియని మూలాల నుంచి రూ. 426.74 కోట్ల విరాళాలు వచ్చినట్లు ఏడీఆర్ వెల్లడించింది. ఇదే సమయంలో 27 ప్రాంతీయ పార్టీలకు రూ. 263.92 కోట్లు వచ్చినట్లు తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 2020-21 ఆర్థిక సంవత్సరం రూ. 178.78 కోట్లు విరాళాలు రాగా.. బీజేపీకి రూ.100.502 కోట్లు విరాళంగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన గుప్త విరాళాలు మొత్తం జాతీయ పార్టీలకు వచ్చిన గుప్త విరాళాల్లో 41.89 శాతం కావడం గమనార్హం. ఇక ప్రాంతీయ పార్టీల్లో వైసీపీకి రూ. 96.25 కోట్ల విరాళాలతో దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. డీఎంకే రూ.80.02 కోట్లు, బీజేడీ రూ.67 కోట్లు, ఎంఎన్‌ఎస్ రూ.5.77 కోట్లు, ఆప్ రూ.5.4 కోట్ల గుప్తవిరాళాలతో తరువాతి స్థానాల్లో నిలిచాయి.
Read Also: China-USA: చైనా, అమెరికా ప్రచ్ఛన్న యుద్ధం.. విమానాలు రద్దు చేసుకున్న ఇరు దేశాలు
8 జాతీయ పార్టీలను పరిశీలిస్తే.. భాజపా, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీ, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీఈపీ) ఉండగా.. 27 ప్రాంతీయ పార్టీల్లో ఆప్, ఏజీపీ, ఏఐఐఏడీఎంకే, ఏఐఎఫ్‌బీ, ఏఐఎంఐఎం, ఏఐయూడీఎఫ్, బీజేడీ, సీపీఐ (ఎంఎల్) (ఎల్), డీఎండీకే, డీఎంకే, జీఎఫ్‌పీ, జేడీఎస్, జేడీయూ, జేఎంఎం, కేసీ-ఎం, ఎంఎన్‌ఎస్, ఎన్‌డీపీపీ, ఎన్‌పీఎఫ్, పీఎంకే, ఆర్‌ఎల్‌డీ, ఎస్‌ఏడీ, ఎస్‌డీఎఫ్, శివసేన, ఎస్‌కేఎం, తెదేపా, తెరాస, వైకాపా పార్టీలు ఉన్నాయి.