UP: ఉత్తర్ ప్రదేశ్ బిజ్నోర్ పట్టణంలో ‘‘మీరట్’’ తరహా మర్డర్ సంచలనంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం భార్యనే భర్తను చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బిజ్నోర్ నజీబాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంతో ఈ ఘటన జరిగింది. రైల్వే టెక్నీషియన్‌గా పనిచేస్తున్న దీపక్ కుమార్‌ని అతడి భార్య శివాని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన భర్త గుండెపోటుతో మరణించినట్లు ముందుగా శివాని చెప్పింది.
Read Also: Punjab: బీజేపీ నేత ఇంటిపై గ్రెనేడ్ దాడి.. పాకిస్తానీతో సహా ఇద్దరు అరెస్ట్..
అయితే, దీపక్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగి కావడంతో కుటుంబం పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టింది. దీంట్లో దీపక్ కుమార్ గొంతు నులిమి చంపినట్లు తేలింది. శివానీతో పాటు మరో వ్యక్తి కలిసి భర్త ఉద్యోగం కోసం హత్య చేసి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సంఘటన జరిగిన ఏప్రిల్ 04న, శివాని తన మరిది పియూష్‌కి దీపక్‌కి గుండెపోటు వచ్చిందని సమాచారం ఇచ్చింది. అతడు వెళ్లే లోపే దీపక్ చనిపోయాడు. అయితే, శివానీ పోస్టుమార్టం నిర్వహించడానికి వ్యతిరేకత వ్యక్తం చేయడంతో కుటుంబం ఆమె తీరును అనుమానించింది.
దీపక్‌ని శివానీ మరో వ్యక్తి కలిసి హత్య చేసిన ఉంటారని దీపక్ సోదరుడు పియూష్ ఆరోపించాడు. దీపక్, శివానీలు ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఆరు నెలల బాబు ఉన్నాడు. శివానీ తన అత్తగారిని కూడా శారీరకంగా హింసించేదని ఆరోపణలు ఉన్నాయి. విచారణలో శివానీ దీపక్ కి నిద్రమాత్రలు ఇచ్చి, స్పృహ కోల్పోయేలా చేసిందని వెల్లడైంది. ఆ తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు ఆరోపించారు. ఈ కేసులో శివానిని విచారిస్తున్నామని ఏఎస్పీ వాజ్‌పేయి తెలిపారు. మార్చి 2023లో దీపక్ రైల్వేలో చేరాడు.