Shivraj Chouhan: జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక హామీ ఇచ్చింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్(ఎన్ఆర్‌సీ) అమలు చేస్తామని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. సీఎం హేమంత్ సొరెన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చొరబాటుదారులకు మద్దుతగా నిలుస్తోందని ఆరోపించారు. బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతోందని, ఈ ఎన్నికలు ఒకర్ని సీఎం చేయడానికి లేదా అధికారాన్ని దక్కించుకోవడం కోసం కాదని, జార్ఖండ్‌ని రక్షించడం గురించి అని ఆయన అన్నారు.
ఈ నేలని, మన పిల్లల్ని రక్షించాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు చౌహాన్ చెప్పారు. బంగ్లాదేశ్ చొరబాట్ల కారణంగా ఈ ప్రాంతంలో వేగంగా జనాభా మారుతోందని, సంతాల్ ప్రాంతంలో గిరిజన జనాభా ఇప్పుడు 28 శాతానికి తగ్గిందని అన్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ చొరబాటుదారులకు అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. హేమంత్ సొరెన్ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చొరబాట్లను ప్రోత్సహిస్తోందని, జార్ఖండ్‌లో తప్పకుండా ఎన్ఆర్‌సీని అమలు చేస్తామన్నారు.
Read Also: Telangana: గల్ఫ్ వర్కర్స్‌కు 5 లక్షల పరిహారం.. గైడ్ లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం
రానున్న ఎన్నికల కోసం అక్టోబర్ 5న బీజేపీ యువత, మహిళల కోసం ‘పాంచ్ ప్రాణ’ హామీలను విడుదల చేసింది. పార్టీ ప్రకటించిన 5 హామీల్లో యువసతి, గోగో దీదీ యోజన, ఘర్ సాకార్, లక్ష్మీ జోహార్, ఉపాధి ఉన్నాయి. గోగో దీదీ యోజన కింద ప్రతీ మహిళకు నెలకు రూ. 2100 ఆర్థిక సాయాన్ని ఇస్తామని చెప్పారు. 5 ఏళ్లలో యువతకు 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. యువ సతి కింద పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు రూ. 2000 ఆర్థిక సాయం, 2025 నాటికి 1 లక్ష ప్రభుత్వ నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పింది.
ప్రస్తుతం జార్ఖండ్ ప్రభుత్వ పదవీ కాలం 2025 జనవరితో ముగుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎన్నికలు నిర్వహించనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 సీట్లు ఉన్నాయి. 2020 ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తీ మోర్చా(జేఎంఎం) 30, బీజేపీ 25, కాంగ్రెస్ 16 గెలుచుకుంది.