China: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి మళ్లీ భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే, 2014, 2019 మాదిరిగా కాకుండా ఈ సారి బీజేపీ మెజారిటీ మార్కుకు దాదాపుగా 30 సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిసి అధికారం ఏర్పాటు చేయబోతున్నారు. 543 ఎంపీ స్థానాల్లో బీజేపీ 240 గెలవగా, మిత్రపక్షాలతో కలిసి మ్యాజిక్ ఫిగర్(272)ని దాటి 293 సీట్లను ఎన్డీయే సీట్లను సాధించింది.
అయితే, ఈ పరిణామం కొన్ని దేశాలకు మాత్రం చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా డ్రాగన్ కంట్రీ చైనా మోడీకి మెజారిటీ తగ్గడంపై ఆనందం వ్యక్తం చేస్తోంది. బలమైన పొరుగుదేశాన్ని కోరుకునే మనస్తత్వం లేని చైనాకి, భారత్ ఎదుగుదల ప్రతిబంధకంగా మారింది. ముఖ్యంగా చైనాలోని చాలా పెట్టుబడులు భారత్‌కి తరలివస్తున్నాయి. ఇందుకు యాపిల్ సంస్థ ఓ ఉదాహరణ. దీంతో పాటు తయారీ రంగంపై భారత్ దృష్టి పెట్టడం, ఇది మోడీ హయాంతో వేగం కావడం చైనాకు నచ్చడం లేదు.
సంకీర్ణ ప్రభుత్వాల్లో పెద్ద నిర్ణయాలు తీసుకునేందుకు, సంస్కరణలు చేపట్టేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని అందరికి తెలుసు. ఈ విషయాన్నే చైనా నిపుణులు హైలెట్ చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC) ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రిక ‘‘ మోడీ కూటమి కేవలం స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది’’ అని హెడ్‌లైన్ పెట్టింది. మూడో టర్మ్‌లో ఆర్థిక సంస్కరణలు కష్టతరమైన లక్ష్యమని పేర్కొంది. చైనా తయారీతో పోటీ పడాలని మరియు భారతదేశ వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచాలనే మోదీ ఆశయం నెరవేరడం కష్టమని చైనా నిపుణులు చెప్పినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
చైనాకు చెందిన మరో ప్రముఖ పత్రిక చైనా డైలీ తన కథనంలో ‘‘ పార్టీకి ఎదురుదెబ్బల మధ్య మోడీ విజయం సాధించారు’’ అని పేర్కొంది. భారతదేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున ఫలితాలు ఓటరు ప్రాధాన్యతలో మార్పులను సూచించాయని చెప్పింది. ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలపై మోడీ ప్రభుత్వం దృష్టిసారిస్తే, చైనా తయారీ రంగంపై దెబ్బపడుతుందని చైనా మీడియా కథనాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. మోడీ హయాంలో యాపిల్ ప్రధాన తయారీదారు ఫాక్స్‌కాన్ చైనా నుంచి భారత్‌కి తమ ఉత్పత్తిని తరలిస్తోంది. తైవాన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ కంపెనీ చైర్మన్ యంగ్ లియు 2023లో అనేకసార్లు ప్రధానిని కలిశారు.
దీంతో పాటు ఇంతవరకు చిప్ తయారీ రంగంలో చైనా నియంతృత్వాన్ని దెబ్బతీసేందుకు, ఇండియా సెమికండక్టర్ తయారీకి పరిశ్రమలకు రాయితీలు ఇచ్చి, ఇండియాలోనే తయారయ్యేలా అంతర్జాతీయ కంపెనీలను ఆహ్వానిస్తుంది. 2022లో భారత్ బ్రిటన్‌ని అధిగమించి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడంతో పాటు 2023-24లో 8 శాతం జీడీపీ గ్రోత్ రేట్‌ని సాధించింది, ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది.
మోడీ 3.0 సంకీర్ణ ప్రభుత్వం ఖచ్చితంగా విధానపర నిర్ణయాల అమలుకు ఆటంకం కలిగిస్తుందని లండన్‌కి చెందిన థింక్ ట్యాంక్ చాథమ్ హౌజ్ చెప్పింది. ఎన్నికల ఫలితం భారతదేశ విధాన రూపకల్పన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది, భూసేకరణ మరియు కార్మిక సంస్కరణలు వంటి కొన్ని రాజకీయంగా సున్నితమైన ఆర్థిక సంస్కరణలపై పురోగతి సాధించడం మరింత కష్టతరం చేస్తుందని చెప్పింది. మరోవైపు చైనా మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. వ్యాపారం మరియు ఆర్థిక వర్గాలతో పాటు అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తుపై చాలా నమ్మకంగా లేరని మార్కెట్ ప్రతిచర్య చూపిస్తుంది అని వ్యాఖ్యానించింది.