Ravneet Singh Bittu: ముచ్చటగా మూడోసారి నరేంద్రమోడీ ప్రభుత్వం కేంద్రంలో కొలువుదీరింది. ఈ రోజు వరసగా మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేశారు. మోడీతో సహా 72 మందితో కేబినెట్ కొలువుదీరింది. ఈ కేబినెట్‌లో ఓడిపోయిన ఎవరికీ కూడా మంత్రి పదవులు ఇవ్వలేదు. కానీ లూథియానా నుంచి ఓడిపోయిన రవ్‌నీత్ బిట్టూని మాత్రం ప్రధాని మోడీ తన మంత్రివర్గంలోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల ముందు బిట్టూ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. పంజాబ్‌లో బీజేపీ ఎదుగుదలకు బిట్టూ చేరిక చాలా కీలమైందిగా ఆ పార్టీ భావిస్తోంది.
2024 లోక్‌సభ ఎన్నికల ముందు వరకు పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్(ఎస్ఏడీ)కి బీజేపీ జూనియర్ పార్ట్‌నర్‌గా ఉండేది. అయితే, 2020లో కేంద్రం తీసుకువచ్చని మూడు రైతుల చట్టాల కారణంగా ఎన్డీయే కూటమి నుంచి ఎస్ఏడీ బయటకు వెళ్లింది. అప్పటి నుంచి బీజేపీ పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో లూథియానాలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ చేతిలో బిట్టు ఓడిపోయారు.
Read Also: Bandi Sanjay: కేంద్ర మంత్రి పదవి లభించడంపై బండి సంజయ్ స్పందన
ఓడిపోయినప్పటికీ పంజాబ్‌లో బీజేపీ ఎదగాలంటే బిట్టూని కేంద్ర మంత్రిమండలిలోకి తీసుకోవాలని భావించింది. ఇదిలా ఉంటే పంజాబ్ వ్యాప్తంగా ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతున్న ఖలిస్తానీ మద్దతును అరికట్టాలంటే పంజాబ్ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం ఉండాలని బీజేపీ భావించింది. ఇదే కాకుండా, ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బియాంత్ సింగ్ మనవడిగా రవ్‌నీత్ సింగ్ బిట్టూకు పేరుంది. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే బియాంత్ సింగ్ హత్యకు గురయ్యాడు.
ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో ఇద్దరు ఖలిస్తానీ మద్దతుదారులు గెలవడం ఆందోళన కలిగించే అంశం. పంజాబ్‌లో అత్యధికంగా 1,97,120 ఓట్ల తేడాతో ఖదూర్ సాహిబ్ నుంచి తీవ్రవాద ఆరోపణల కింద డిబ్రూగఢ్ జైలులో ఉన్న ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృతపాల్ సింగ్ గెలిచాడు. ఫరీద్‌కోట్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు సరబ్‌జిత్ సింగ్ 70,053 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ కారణాల వల్ల కూడా బిట్టూని మోడీ తన మంత్రి వర్గంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.