కరోనా కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకుంటే వేరియంట్ల మీద వేరియంట్లు పుట్టుకొచ్చి భయపెడుతున్నాయి. దేశంలో తాజాగా రెండు కొత్త వేరియంట్లకు సంబంధించి కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఉద్ధృతి దేశంలో కాస్త తగ్గింది. కేసులు కూడా గతంతో పోలిస్తే బాగా తగ్గాయ్. అయితే ఒమిక్రాన్‌కు సంబంధించిన వేరియంట్లు ఒక్కొక్కటిగా బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
మహారాష్ట్రలోని పూణేలో బీఏ4, బీఏ5 కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బాధితుల్లో ముగ్గురు మహిళలతో పాటు తొమ్మిదేళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. మరోవైపు వైరస్ బారిన పడినవారిలో ఇద్దరు విదేశాలకు వెళ్లివచ్చారని, మరో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. వీరంతా వ్యాక్సిన్ తీసుకున్నవారే..! దీంతో మహారాష్ట్ర సరిహద్దులో వున్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా వైద్యాధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అప్రమత్తం చేశారు.
తాజాగా బీఏ4, బీఏ5 వేరియంట్ కేసులను మహారాష్ట్రలోని ఏడుగురు వ్యక్తుల్లో గుర్తించారు. కరోనా మొదటి, రెండో వేవ్‌లలో వైరస్ మహారాష్ట్ర నుంచి తెలంగాణకు దిగుమతి కావడంతో బీఏ4, బీఏ5 వేరియంట్ల వ్యాప్తి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్రతో సరిహద్దు ఉన్న జిల్లాల వైద్యాధికారులను ఆదేశించారు. ఈ వేరియంట్లు సోకితే తీవ్ర అనారోగ్యం, ప్రాణాపాయం లేకున్నా… వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఈ నెల ఆరంభంలో బీఏ4 తొలి కేసును దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో గుర్తించిన సంగతి తెలిసిందే. కొత్త వేరియంట్ ఉనికిలో ఉన్న దక్షిణాఫ్రికా నుంచి తెలంగాణ వచ్చిన ఒక ప్రయాణికుడికి హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు నిర్వహించగా బీఏ4 వేరియంట్ సోకినట్లు తేలింది. ఆ తర్వాత తమిళనాడులోనూ బీఏ4, బీఏ5 కేసులు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో కరోనా సబ్ వేరియంట్ బీఏ.2 వైరస్ వ్యాప్తిలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది. రాస్ట్రంలో బీఏ4,బీఏ5 కేసులు కూడా ఒక్కోటి చొప్పున నమోదయ్యాయని తేల్చింది. బీఏ.2 వేరియంట్ కేసులు 72శాతం మేర తెలంగాణలో వ్యాప్తి లో ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో సర్వేలో తేలింది. మొత్తం 66 శాంపిళ్లను పరిశీలించగా అందులో 45 కేసులు బీఏ.2వి కాగా… ఒక్కోటి చొప్పున బీఏ4, బీఏ5 కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ4, బీఏ5 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనుకుంటున్నవేళ… తాజా వేరియంట్లు మళ్లీ దేశంలో అలజడి రేకెత్తిస్తున్నాయి.