Mohan Bhagwat: బీజేపీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌కి కేంద్రం భద్రతను పటిష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న ‘‘జెడ్-ప్లస్’’ కేటగిరి నుంచి మరింత పటిష్టమైన అధునాతన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తూ ఏఎస్ఎల్ ప్రోటోకాల్‌కి భద్రతను పెంచారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి సమానంగా భగవత్‌కి భద్రతను అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) సిబ్బంది మోహన్ భగవత్‌కి భద్రతను అందిస్తోంది.
ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు పాలించే రాష్ట్రాల్లో ‘‘ప్రెష్ రిస్క్ అసెస్‌మెంట్’’ అంచనాల తర్వాత ఈ కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. రాడికల్ ఇస్లామిక్ గ్రూపులతో సహా వివిధ సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్ భగవత్‌తో పాటు దేశంలోని 10 మంది వ్యక్తులకు మాత్రమే జెడ్-ప్లస్ కేటగిరి భద్రత ఉంది. ఇప్పుడు దానిని ఏఎస్ఎల్ భద్రతకు పెంచారు.
Read Also: Puja Khedkar: “నా అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అధికారం యూపీఎస్సీకి లేదు”
ASL భద్రత అంటే ఏమిటి..?
అడ్వాన్సుడ్ సెక్యూరిటీ లైజన్(ఏఎస్ఎల్) కింద జిల్లా పరిపాలన, పోలీస్, హెల్త్ డిపార్ట్‌మెంట్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన ఇతర డిపార్ట్‌మెంట్ల వంటి స్థానిక ఏజెన్సీలు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఈ వ్యూహంలో మల్టీ లేయర్ సెక్యూరిటీ వయలం, కఠినమైన విధ్వంసక చర్యల్ని ఎదుర్కొనేందుకు సెక్యూరిటీ ఉంటుంది. నేతల పర్యటనలకు సంబంధించి ముందస్తు రివ్యూలు, సమీక్షలు, రిహార్సల్స్ ఉంటాయి. స్థానిక పోలీసులతో సన్నిహిత సమన్వయంతో పాటు విధ్వంసక నిరోధక తనిఖీలు చేస్తారు. వేదికలను ముందే ఎలాంటి ప్రమాదాలు లేకుండా శానిటైజ్ చేస్తుంది. ఏఎస్ఎల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, గాంధీ కుటుంబ నేతలకు ఉంది.