క్షణికావేశంలో చేసిన తప్పులు కారణంగా వారంతా జైల్లో మగ్గుతున్నారు. రక్త సంబంధాలకు దూరంగా నాలుగు గోడల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. వారికి ఓ పండుగ ఉండదు. ఓ ఆనందం ఉండదు. అక్కడే తింటూ.. ఆ నలుగురితోనే ఉంటూ ధీనమైన బతుకును జీవిస్తుంటారు. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఒక ఆందోళనకరమైన జీవితాన్ని జీవిస్తున్న ఖైదీల కోసం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ఖైదీల్లో సరికొత్త మార్పు తీసుకొచ్చేందుకు దసరా పండుగ సందర్భంగా దుర్గాపూజ జరిగే సమయంలో సరికొత్త మెనూ అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
దుర్గాపూజ వేడుకల సమయంలో ఖైదీలకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లంచ్, డిన్నర్ సమయంలో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బసంతి పులావ్, మాచెర్ మాతా దియే పుయ్ షాక్ (చేప తలతో కూడిన మలబార్ బచ్చలికూర) మరియు మాచెర్ మాతా దియే దాల్ (చేప తలతో పప్పు) తో వడ్డించనున్నారు. ఖైదీలు పండుగ సంతోషాన్ని కోల్పోతున్నామన్న బాధ కలుగకుండా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త మెనూ అక్టోబర్ 9 నుంచి 12 వరకు అందించనున్నారు. ఈ ఆహార పదార్థాలన్నీ ఖైదీల చేతనే తయారు చేయించనున్నారు. ఖైదీల్లో మార్పు తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం అధికారి వెల్లడించారు.
ఈ కొత్త మెనూ ఖైదీలతో పాటు రిమాండ్ ఖైదీలకు కూడా అందించనున్నారు. లంచ్, డిన్నర్ సమయంలో షష్టి నుంచి దశమి వరకు అమల్లో ఉంటుందని అధికారి తెలిపారు. దుర్గాపూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు చక్కని ఆహారాన్ని అందిస్తామని వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఖైదీలకు దసరా పండుగ సందర్భంగా మంచి ఆహారం అందిస్తామని.. ఈసారి ఖైదీల కోరిక మేరకు ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేవలం వారి ముఖాల్లో చిరునవ్వు తెచ్చేందుకే ఈ ప్రయత్నమని చెప్పుకొచ్చారు. ఇలాంటి కార్యక్రమాలతో ఖైదీల వ్యక్తిగత జీవితాల్లో మంచి మార్పు వస్తుందని భావిస్తున్నట్లు అధికారి తెలిపారు. ఈ రుచికరమైన వంటకాలన్నీ ఖైదీలే తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నారని వెల్లడించారు.
వైరటీలు ఇవే..
మాచర్ మాతా దియే పుయ్ షక్, మాచెర్ మాతా దియే దాల్, లూచీ-చోలార్ దాల్, పాయేష్, చికెన్ కర్రీ, ఆలు. పొటోల్ చింగ్రీ, మటన్ బిర్యానీ విత్ రైతా మరియు బసంతి పులావ్ ఉండనున్నాయి. మొత్తానికి బెంగాల్‌లో ఫేమస్ అయిన వంటకాలన్నీ ఖైదీలు రుచి చూడనున్నారు. ఇదిలా ఉంటే ఖైదీలకు బలవంతంగా ఆహారాన్ని అందించబోమన్నారు. ఎవరి మతాచారాల ప్రకారం నచ్చిన ఆహారాన్ని మాత్రమే అందిస్తామని అధికారి తెలిపారు.