Vrindavan Temple Corridor: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బృందావన్ టెంపుల్ కారిడార్ పై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఈ టెంపుల్ కారిడార్ వల్ల తాము నిరాశ్రయులం అవుతామని.. తమ జీవనాధారం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తామంతా వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ కు రక్తంతో లేఖలు రాస్తున్నారు. ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ ప్రాజెక్ట్ తరహాలో ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలోని బృందావన్‌లోని ప్రసిద్ధ బాంకే బిహారీ ఆలయం చుట్టూ కారిడార్ నిర్మించాలన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గత రెండు రోజలు నుంచి మార్కెట్ మూసేశారు. పూజారులు కూడా స్థానికులకు మద్దతు పలుకుతున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టుకు కూడా చేరింది, దీనిపై విచారణ కూడా జరుపుతోంది. ఈ నెలాఖరులో సుప్రీంకోర్టు కూడా దీనిపై విచారణ జరపనుంది.
Read Also: Naresh- Pavitra: నరేష్ తో పవిత్ర ఎఫైర్.. అందుకే పెట్టుకొందన్న రమ్య
వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం చుట్టూ కారిడార్ కోసం ఐదెకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక వేళ కారిడార్ నిర్మిస్తే చుట్టుపక్కల ఉన్న 300 నివాస భవనాలను కూల్చేయాల్సి ఉంటుంది. వందల ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న ప్రజలు దీనిపై అభ్యంతరం తెలుపుతున్నారు. 2022 డిసెంబర్ 20న అలహాబాద్ హైకోర్టు కారిడార్ కోసం సర్వే చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తన సర్వే రిపోర్టును ఈ రోజు హైకోర్టుకు సమర్పించింది.
బంకే బిహారీ దేవాలయం బృందావన్‌లోని అత్యంత ప్రసిద్ధ దేవాలయం, ఇది మథుర నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది శ్రీకృష్ణుని జన్మస్థలం అని చాలా మంది నమ్ముతారు. ఆలయం వద్ద ఎక్కువ మంది బస చేసేందుకు వీలుగా కారిడార్ అవసరమని.. భక్తులు అక్కడికి చేరుకోవడానికి ఈ ప్రాజెక్టు సులభతరం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్థానికంగా కూల్చివేయడానికి అవరసమైన ఇళ్లు, భవనాలను గుర్తించడానికి ఓ సర్వే కూడా నిర్వహించింది. కాగా, మథుర ఎంపీ హేమామాలిని.. కారిడార్ అవసరం అని, భక్తులు ఇక్కడికి సులభంగా చేరుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని.. వ్యాపారులు, పూజారలు, స్థానికుల ఆందోళనలు పరిగణలోకి తీసుకుని అన్ని ప్రయోజనాలను కల్పిస్తామని ఆమె అన్నారు.