Tamil Nadu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు అంతా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2026లో జరిగే ఎన్నికల్లో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్‌ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తమిళగ వెట్రీ కజగం (టీవీకే) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కమిటీ సమావేశం తర్వాత మాట్లాడుతూ.. తమ పార్టీ ఎప్పుడూ బీజేపీతో పొత్తు పెట్టుకోదని, బహిరంగంగా, లోపాయికారిగా కూడా పొత్తు ఉండదని విజయ్ స్పష్టం చేశారు.
‘‘బీజేపీ వేరే ఎక్కడైనా విష బీజాలు నాటవచ్చు, కానీ తమిళనాడులో కాదు’’ అని అన్నారు. తమ పార్టీకి సైద్ధాంతిక శత్రువుగా ఉండే వారితో చేతులు కలిపే అవకాశాన్ని స్టార్ హీరో విజయ్ స్పష్టంగా తిరస్కరించారు. మీరు అన్నా, పెరియార్‌లను వ్యతిరేకించలేరు, అవమానపరచలేదు, తమిళనాడులో మీరు గెలవలేరు. బీజేపీతో చేతులు కలపడానికి టీవీకే డీఎంకే లేదా ఏఐఏడీఎంకే కాదు అని విజయ్ చెప్పారు.
Read Also: CUET UG 2025: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
ఎన్నికల ముందు పొత్తులపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారాన్ని పార్టీ విజయ్‌కు అప్పగించింది. టీవీకే తన సభ్యత్వాలను విస్తరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రెండు కోట్ల మంది సభ్యులను చేర్చుకోవడానికి విజయ్ ఈ ఏడాది సెప్టెంబర్ నునంచి డిసెంబర్ వరకు తమిళనాడు అంతటా రాష్ట్రవ్యాప్త పర్యటన చేపడుతారని తెలుస్తోంది. ఓటర్లను కలిసి వారి మద్దతును పొందాలని చూస్తున్నారు.
టీవీకే రెండో రాష్ట్ర సమావేశం ఆగస్టులో జరగనుంది. ఆ సమయంలో మరిన్ని వ్యూహాలను బయటపెట్టే అవకాశం ఉంది. కచ్చతీవు ద్వీపాన్ని కేంద్రం తిరిగి పొందాలని టీవీకే డిమాండ్ చేసింది. కీజాడిలో కనుగొన్న వాటిని కప్పిపుచ్చే ప్రయత్నాలను ఖండించింది, ఇది 2000 ఏళ్ల నాటి తమిళ నాగరికతకు నిదర్శనమని పేర్కొంది. ఢిల్లీ నిరసనల్లో రైతులకుపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును టీవీకే ఖండించింది. సీఎం స్టాలిన్ కేంద్రానికి రాసిన లేఖలు సరిపోవాని, కృష్ణగిరి, తేని, తిరువళ్లూరు, సేలం మరియు దిండిగల్‌లలో మామిడి రైతుల హక్కుల కోసం పోరాడతామని టీవీకే ప్రతిజ్ఞ చేసింది.