కాబోయే రాష్ట్రపతి ఎవరు..? అధికార పార్టీ అభ్యర్థి ఎవరు..? విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగేదెవరు..? ఇలాంటి ప్రశ్నలకు ఇవాళ తెరపడే అవకాశం కనిపిస్తోంది.. ఉపరాష్ట్రపతిగా ఉన్న ఎం. వెంకయ్యనాయుడు.. తదుపరి రాష్ట్రపతిగా పోటీకి పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది… తదుపరి రాష్ట్రపతి వెంకయ్యనాయుడే అనే చర్చ సాగుతోంది.. ఆయనతో ఇవాళ హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.. రాష్ట్రపతి ఎన్నికలపై కీలకమైన పార్టీ సమావేశానికి ముందు అమిత్ షా, రాజ్‌నాథ్, నడ్డా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. రాజ్యాంగ అత్యున్నత పదవికి బీజేపీ అధిష్టానం నాయుడును పరిశీలిస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది..
మరోవైపు, రాష్ట్రపతి ఎన్నికపై ప్రతిపక్ష పార్టీలతో సహా వివిధ పార్టీలతో మాట్లాడేందుకు రాజ్‌నాథ్ సింగ్ మరియు జేపీ నడ్డాలకు బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కొత్త రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానున్న నేపథ్యంలో నాయుడుతో కేంద్రమంత్రులు, బీజేపీ చీఫ్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లో ఉన్న వెంకయ్యనాయుడు.. ఉదయం సికింద్రాబాద్‌లో యోగా దినోత్సవంలో పాల్గొన్నారు.. ఇక, ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే హుటాహుటిన హస్తినకు వెళ్లారు.. ఆ తర్వాత అమిత్ షా, రాజ్‌నాథ్ సింత్, జేపీ నడ్డా.. ఆయన్ను ఇంటికి వెళ్లి కలిశారు. దాదాపు 50 నిమిషాల పాటు వీరా భేటీ జరిగింది.. రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ జరగడానికి ముందు.. వెంకయ్య ఇంట్లో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పలువురు పేర్లు వినిపిస్తున్నా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై ప్రముఖంగా చర్చసాగుతోంది.. ఈ నేపథ్యంలోనే కీలక నేతలు ఆయనతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇక, దాదాపు.. కొత్త రాష్ట్రపతి ఎన్నిక లాంఛనమే అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.. అధికార పార్టీకి ఎలక్ట్రోరల్ కాలేజీలో 48 శాతానికిపైగా మద్దతు ఉంది. దీంతో దాదాపు అధికారపార్టీ అభ్యర్థే విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.. మరోవైపు, విపక్షాల అభ్యర్థి కూడా ఈరోజు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.. యశ్వంత్ సిన్హా పేరు దాదాపు ఖరారైనట్లుగా ప్రచారం సాగుతోంది.