ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల వేగం పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. 2జీ సర్వీసులను 4జీకి మార్చేందుకు రూ. 2,426.39 కోట్ల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 2,343 బీఎస్ఎన్ఎల్ టవర్లను 4జీకి అప్గ్రేడ్ చేయనుంది సర్కార్.. దీంతో, మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టడం కూడా సులభం అవుతుందని కేంద్రం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Read Also: YSRCP: టార్గెట్ 2024.. వైసీపీ నేతలతో జగన్ విస్తృతస్థాయి సమావేశం
ఇక, ఈ ఖరీఫ్ సీజన్లో ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీని కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. గత ఏడాదితో పోల్చితే 50 శాతం సబ్సిడీ పెరిగింది.. మొత్తం సబ్సిడీ విలువ రూ. 60,939.23 కోట్లుగా ఉంది.. దేశీయంగా ఉత్పత్తి చేసే ఎరువులకు, డీఏపీకి కూడా సబ్సిడీ వర్తించనుంది. 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.. రూ. 4,526.12 కోట్లతో జమ్ము-కశ్మీర్లోని కిష్త్వార్ వద్ద చీనాబ్ నదిపై ప్రాజెక్టు ఏర్పాటు కానుంది.. 54 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తికానుండగా.. 2,700 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.