రాజస్థాన్ ఉదయ్ పూర్ లో టైలర్ కన్హయ్య లాల్ హత్య దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. రాజస్థాన్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ బంద్ చేశారు. ఉదయ్ పూర్ లో కర్ఫ్యూ విధించారు. ప్రజలంతా సంయమనంతో ఉండాలని సీఎం అశోక్ గెహ్లాట్ కోరారు. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చాడనే నెపంతో ఇద్దరు మతోన్మాదులు రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్ లు తన షాపులో ఉన్న కన్హయ్య లాల్ పై కత్తితో దాడి చేసి తలను వేరు చేసి చంపారు. ఈ ఘటనను యావత్ దేశం ఖండిస్తోంది. ఇస్లాం సంస్థలు ఈ ఘటనను ఖండించాయి. ఈ ఘటన ఇస్లాంకు వ్యతిరేఖమని పేర్కొన్నాయి.
ఇదిలా ఉంటే కన్హయ్యలాల్ దారుణ హత్య నేపథ్యంలో ఉదయ్ పూర్ ఐజీతో, ఎస్పీతో పాటు 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది గెహ్లాట్ సర్కార్. తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేసినా.. ఉదయ్ పూర్ పోలీసులు అతనికి భద్రత కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా కన్హయ్య లాల్ ను చంపడమే కాకుండా.. ప్రధాని మోదీకి కూడా ఇదే గతి పడుతుందని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు నిందితులు.
Read Also:Taslima Nasreen: భారతదేశంలో హిందువులు కూడా సురక్షితంగా లేరు.
ప్రస్తుతం ఈ కేసులో నిందితులిద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు మరో 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) ఈ కేసును విచారిస్తోంది. నిందితులిద్దరికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ దావత్-ఏ-ఇస్లామీతో సంబంధాలు ఉన్నాయని.. నిందితుల్లో ఒకరు 2014లో కరాచీకి కూడా వెళ్లి వచ్చారని విచారణలో తేలింది. పక్కా పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందని రాజస్థాన్ పోలీస్ చీఫ్ ఎంఎల్ లాథర్ తెలిపారు. ఈ సంఘటనపై నిర్లక్ష్యం వహించిన ఏఎస్ఐని సస్పెండ్ చేశారు అధికారులు. ఘటనకు పాల్పడిన నిందితులను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపారు.