PM Modi: 2024 ఎన్నికల్లో మెజారిటీ సాధించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి రాబోతోంది. ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి బాధ్యతలు తీసుకోబోతున్నారు. మొత్తం 543 ఎంపీ సీట్లు ఉన్న పార్లమెంట్ దిగువసభలో మ్యాజిక్ ఫిగర్(272)ని దాటి ఎన్డీయే కూటమి 293 స్థానాలను సాధించింది. గత రెండు పర్యాయాలతో పోలిస్తే బీజేపీ సీట్లు తగ్గినప్పటికీ, కూటమిగా అధికారాన్ని చేపట్టబోతోంది. బీజేపీకి ఈ ఎన్నికల్లో 240 సీట్లు వచ్చాయి. మెజారిటీ మార్కు కన్నా దాదాపుగా 30 సీట్లు తగ్గాయి. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటూ మోడీ చరిత్ర సృష్టిస్తున్నారు.
బీజేపీ, ఎన్డీయే కూటమి, ప్రధాని మోడీ విజయం పట్ల ప్రపంచ దేశాధినేతలు తమ అభినందనలు తెలియజేస్తున్నారు. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, శ్రీలంక, దక్షిణకొరియా, తైవాన్, యూరోపియన్ యూనియన్ ఇలా అన్ని దేశాలు శుభాకాంక్షలు తెలిపాయి. కాస్త ఆలస్యమైనా కెనడా, ఉక్రెయిన్ దేశాధినేతలు కూడా ప్రధాని మోడీకి అభినందనలు తెలియజేశారు.
Read Also: Ukraine: మోడీకి కంగ్రాట్ చెప్పిన జెలెన్ స్కీ.. ఉక్రెయిన్‌కు ఆహ్వానం
ఇదిలా ఉంటే రెండు దేశాలు మాత్రమే మరోసారి అధికారం చేపట్టబోతున్న నరేంద్రమోడీకి రెండు దేశాలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అభినందనలు తెలియజేయలేదు. పాకిస్తాన్, టర్కీలు ఇప్పటికీ ఎలాంటి సందేశాన్ని పంపించలేదు. ఇటీవల పాకిస్తాన్ ఎన్నికల్లో గెలిచి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న షెహబాజ్ షరీఫ్‌కి ప్రధాని మోడీ శుభాకాంక్షలు చెప్పారు. అయితే, మోడీ మరోసారి గెలిచి భారత ప్రధాని అవ్వడం పాకిస్తాన్‌కి ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. మరోవైపు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కి వంతపాడే టర్కీ దేశం కూడా మోడీకి ఎలాంటి సందేశాన్ని పంపలేదు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్ పలు ఫేక్ హ్యాండిల్స్ ద్వారా మోడీ వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించాయి. ఏకంగా పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి వంటి వారు కాంగ్రెస్, ఆప్, రాహుల్ గాంధీకి బహిరంగంగా మద్దతు పలుకుతూ ట్వీట్స్ చేశారు. పాకిస్తాన్‌లోని ప్రజలు నరేంద్రమోడీ గెలుపును కోరుకోవడం లేదని, ఓడిపోవాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. మరోవైపు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కూడా భారత వ్యతిరేక, మోడీ వ్యతిరేకతను పలు సందర్భాల్లో ప్రదర్శించారు. అంతర్జాతీయ వేదికల్లో పాక్‌కి మద్దతుగా కాశ్మీర్ సమస్యను లేవనెత్తాడు.