కైకాల కన్నుమూత..
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్ను మూశారు. గత కొన్ని రోజుల క్రితం కైకాల సత్యనారాయణ ఇంట్లో కాలు జారిపడగా… సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం కోలుకుని డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఆరోగ్యం తిరగబడిందని తెలుస్తోంది. ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న జన్మించిన కైకాల..1959 లో సిపాయి కూతురు మూవీ తో వెండి తెరపై అడుగు పెట్టారు కైకాల. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు జీవం పోసి.. నవరస నట సార్వభౌమగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఖ్యాతిగాంచారు. తనదైన నటనలో అభిమానులను అలరించడమే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. సుదీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు.
మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
తెనాలి అసెంబ్లీ స్థానంపై ఆసక్తికర కామెంట్లు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా అలియాస్ ఆలపాటి రాజేంద్రప్రసాద్.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య పొత్తు ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇక, తాను మొదట్లో వేమూరులో, ఆ తర్వాత తెనాలిలో పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ఆలపాటి.. ఒక సీటు అని రాసి పెట్టలేదని.. తనను మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరం లేదన్నారు.. అధికారం నాకు కొత్త కాదని స్పష్టం చేశాసిన ఆయన.. ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశానని గుర్తుచేశారు.. తన గురించి కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు రాజా. తాను ప్రత్యామ్నాయం ఆలోచించాల్సిన అవసరం లేదని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టారు.. మరోవైపు.. జనసేన పార్టీతో పొత్తు విషయంపై స్పందిస్తూ.. పొత్తుల వ్యవహారం పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు.. నా రాజకీయ భవితవ్యం కూడా చంద్రబాబు చూసుకుంటారని పేర్కొన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజా.. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఇక, తాను తెలుగు యువత నాయకుడిగా 1989 నుంచి 1994 వరకు పని చేసిన విధానం అందరికీ తెలుసన్న ఆయన.. పార్టీ కోసం ఎంతో శ్రమించా.. 33 ఏళ్లగా పార్టీలో ఉన్నానని గుర్తుచేసుకున్నారు.. కాగా, ఆలపాటి రాజా ప్రస్తుతం తెనాలి టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.. అయితే, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గతంలో ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.. టీడీపీ-జనసేన పొత్తుపై చర్చ సాగుతోన్న సమయంలో.. ఆ సీటు ఎవరికైనా కేటాయించొచ్చు అనే ప్రచారం సాగుతోన్న వేళ.. ఆలపాటి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భద్రాద్రికి ముక్కోటి శోభ
భద్రాద్రికి ముక్కోటి శోభ సంతరించుకుంది. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్ననేపథ్యంలో.. తెప్పోత్సవానికి హంస వాహనాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్తర ద్వార దర్శన మండపం పునరుద్ధరించబడింది. ఆలయానికి రంగులు వేయడం, ప్రాంగణంలో పందిరి, స్వాగత ద్వారాల ఏర్పాటు వంటి పనులు పూర్తయ్యాయి. నేటి నుంచి జనవరి 12వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు కొనసాగనున్నాయి. పగల్‌పత్తు, రాపత్తు, విలాసోత్సవం, విశ్వరూప సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 23న మత్స్యావతారంలో, 24న కూర్మావతారంలో, 25న వరాహావతారంలో, 26న నరసింహావతారంలో, 27న వామనావతారంలో, 28న పరశురామావతారంలో, 29న శ్రీరామావతారంలో, 29న శ్రీరామావతారంలో, 3వ తేదీ బాలరామావతారంలో భద్రాద్రి రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు. జనవరి 1వ తేదీన తిరుమంగైళ్వార్ పరమ పదోత్సవం, అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. దీంతో పగల్ పట్టు ఉత్సవాలు ముగుస్తాయి. 2వ తేదీ ఉదయం 5.00 గంటల నుంచి 6.00 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి తిరువీధి సేవ ఉంటుంది. రాత్రి 8.00 గంటలకు డీఎస్పీ బంగ్లాలో రాపట్టు ఉత్సవం ప్రారంభమవుతుంది. 3న అంబాసత్రం, 4న కృష్ణ దేవాలయం, 5న తహసీల్దార్ నివాసం ఎదురుగా శ్రీరామదాసు మండపం, 6న తాత గుడిసెంటర్‌లోని గోవింద మండపం, 7న పునర్వసు మండపం, 8న అభయాంజనేయ స్వామి ఆలయ శ్రీరామదూత మండపం వద్ద రాపట్టు ఉత్సవం నిర్వహిస్తారు.9న కల్కి అవతారం, దొంగల ఉత్సవం, విశ్రాంత మండప సేవ ఉంటాయి. 10న దమ్మక్క మండపంలో, 11న చిత్రకూట మండపం, ఉభయ వేదాంతాచార్య పీఠం, జీయర్ మఠం వారి ఉత్సవం, రాత్రి శ్రీ నమ్మాళ్వార్ల పరమ పదోత్సవం, రాపట్టు, సాతుమొరాయి నిర్వహిస్తారు. 12న గ్రామపంచాయతీ కార్యాలయంలోని శ్రీనృసింహదాస మండపంలో ఇరామానుసంతండాది సేవ ఉంటుందన్నారు. 13, 14, 15 తేదీల్లో రామయ్య ఉత్సవం నిర్వహిస్తారు. 19న విశ్వరూప సేవను ఘనంగా నిర్వహిస్తారు.
సంక్రాంతి కానుక.. ప్రజలకు నగదు, పొంగల్ గిఫ్ట్
సంక్రాంతి పండుగ వేళ ప్రజలకు శుభవార్త చెప్పారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. సంక్రాంతి పండుగ సందర్భంగా పొంగల్ గిఫ్ట్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.. రేషన్ కార్డ్ దారులకు వెయ్యి రూపాయల నగదు పాటు.. ఒక కేజీ చక్కెర, కేజీ బియ్యం కానుకగా అందిస్తున్నారు.. తమిళనాడులోని 2.19 కోట్లమందికి ఈ పండుగకు ప్రయోజనం చేకూరనుంది.. రేషన్ కార్డ్ హోల్డర్లు అందరూ దీనికి అర్హులు.. ఇది శ్రీలంక పునరావాస శిబిరాల్లో నివసిస్తున్న కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. ఒక్కో కేజీ బియ్యం, పంచదార కూడా లబ్ధిదారులకు అందించనున్నారు. 2,356.67 కోట్ల వ్యయంతో 2.19 కోట్ల మంది రేషన్ కార్డు హోల్డర్లకు ప్రయోజనం చేకూర్చనుంది ప్రభుత్వం.. ముఖ్యమంత్రి స్టాలిన్ జనవరి 2వ తేదీన పొంగల్ గిఫ్ట్ పథకాన్ని ప్రారంభించనున్నారు.. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ కానుకల పంపిణీకి సిద్ధం అయ్యారు అధికారులు.. రేషన్ షాపుల ద్వారా పొంగల్ కిట్ల పంపిణీ చేపట్టనున్నారు.. మరోసారి కరోనా భయపెడుతోన్న వేళ.. కోవిడ్ మార్గదర్శకాలకు లోబడి వీటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పాటలో బాలయ్య బాబు డాన్స్ ఉంటుంది రా చారీ…
నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ రోల్ అయిన ఫ్యాక్షన్ గెటప్ లోకి మారి చేస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. బాలయ్యకి డై హార్డ్ ఫ్యాన్ అయిన గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జనవరి 12న ఆడియన్స్ ముందుకి రానుంది. శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా ప్రమోషన్స్ నందమూరి అభిమానులకి కిక్ ఇచ్చే రేంజులో జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ బయటకి వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తమన్ ఇచ్చిన ట్యూన్స్ బాలయ్య ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పటివరకూ బయటకి వచ్చిన రెండు సాంగ్స్ ని మించేలా, మాస్ కి కిక్ ఇచ్చేలా మూడో సాంగ్ బయటకి రానుంది. ‘మా బావ మనోభావాలు’ అనే టైటిల్ తో బయటకి రానున్న ఈ థర్డ్ సాంగ్ అనౌన్స్మెంట్ ఇటివలే బయటకి వచ్చింది. డిసెంబర్ 24న మధ్యాహ్నం రెండు గంటలకి సంధ్య 35MM థియేటర్ లో ఈవెంట్ చేసి గ్రాండ్ గా ‘మా బావ మనోభావాలు’ సాంగ్ ని రిలీజ్ చెయ్యనున్నారు. సాంగ్ రిలీజ్ కి ఇంకా టైం ఉండడంతో, మైత్రి మూవీ మేకర్స్ నందమూరి అభిమానులకి స్పెషల్ గిఫ్ట్ లా, ఈ సాంగ్ ప్రోమోని ఈరోజు రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ విషయం గురించి చెప్తూ ట్వీట్ చేసిన తమన్… “మా బావ మనోభావాలు ప్రోమో ఈరోజు బయటకి వస్తుంది, ఈ పాటలో బాలయ్య గారి డాన్స్ సూపర్ ఉంటుంది” అంటూ పోస్ట్ చేశాడు. ప్రోమో బయటకి వస్తుందని తెలియగానే నందమూరి అభిమానులు, ‘మా బావ మనోభావాలు’ పాట ‘లెజెండ్’ సినిమాలోని ‘లస్కు టపా’ రేంజులో ఉండాలని తమన్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి తమన్, బాలయ్య కోసం ఎలాంటి ఊపునిచ్చే సాంగ్ చేశాడో చూడాలి.