Bengal Waqf Violence: వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌లో నిర్వహిస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్ ప్రాంతంలో హింస పెరిగింది. ఈ ఘర్షణల్లో ముగ్గురు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిరసనకారులు ఇద్దరు తండ్రికొడుకులను నరికి చంపారు. ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షిదాబాద్‌లో శుక్రవారం జరిగిన హింసాకాండకు సంబంధించి 118 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మృతుల్లో ఇద్దరు ఘర్షణల్లో మరణించగా, ఒకరు కాల్పుల్లో మరణించినట్లు లా అండ్ ఆర్డర్ డీజీపీ జావేద్ షమీమ్ తెలిపారు. శుక్ర, శనివారాల్లో హింసాత్మక దాడులు ఎక్కువ కావడంతో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జంగిపూర్‌లో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది. మరోవైపు, వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ త్రిపురలో ఉనకోటి జిల్లాలో జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో 18 మంది పోలీసులు గాయపడ్డారు.
Read Also: Arjun Son Of Vyjayanthi Trailer: అర్జున్ S/O వైజయంతి ట్రైలర్ అదిరింది చూశారా ?
శుక్రవారం వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాస్, హుగ్లీ జిల్లాల్లో హింస చెలరేగింది. పోలీస్ వ్యాన్‌తో సహా పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. భద్రతా బలగాల పైకి రాళ్లు విసిరారు. రోడ్లను దిగ్భందించారు. శుక్రవారం, ముర్షిదాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్‌పై దాడి చేసి, కంట్రోల్ రూంని ధ్వంసం చేశారు. ఉద్యోగుల వాహనాలకు నిప్పు పెట్టారు.
ఈ అల్లర్ల నేపథ్యంలో, సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. బెంగాల్‌లో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని హామీ ఇచ్చారు. అందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. తమ పార్టీ బిల్లును వ్యతిరేకించింది, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చిందని, కాబట్టి మీకు కావాల్సిన సమాధానాన్ని కేంద్రం నుంచి తీసుకోవాలని అన్నారు.
మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ ప్రభుత్వం, మమతా బెనర్జీపై బీజేపీ ధ్వజమెత్తుతోంది. బెంగాల్‌లో బీజేపీ అధికారంలో ఉంటే మైనారిటీల్లో ఒక వర్గం చేస్తున్న విధ్వంసాన్ని కేవలం 5 నిమిషాల్లో అణిచివేస్తామని బీజేపీ రాష్ట్ర చీఫ్ సుకాంత మజుందార్ అన్నారు. బుజ్జగింపు రాజకీయాల వల్ల మమతా బెనర్జీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ హింసకు కారణమని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఆరోపించారు.