PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. అస్సాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళ్లిన ప్రధాని, అక్కడ ర్యాలీలో మాట్లాడారు. స్వాతంత్ర్యానంతరం అధికారంలో ఉన్న వారు ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారని, తమ సంస్కృతిని, గతాన్ని చూసి సిగ్గు పడ్డారని ఆదివారం అన్నారు. రాజకీయ, సొంత ప్రయోజనాల కోసం తమ స్వంత సంస్కృతి మరియు చరిత్ర గురించి సిగ్గుపడే ధోరణిని ప్రారంభించారని, ఏ దేశం కూడా దాని చరిత్రను నిర్లక్ష్యం చేయడం ద్వారా అభివృద్ధి చెందదని ప్రధాని అన్నారు. గత పదేళ్లలో పరిస్థితి మారిపోయిందని, బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి, వారసత్వ రక్షణను చేస్తోందని వెల్లడించారు.
Read Also: Gudivada Amarnath: జగన్ మళ్లీ సీఎం కావడం చారిత్రక అవసరం..
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని కాంగ్రెస్ నేతలు ఖర్గే, సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌదరి తిరస్కరించిన కొద్ధి రోజుల తర్వాత ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్/ బీజేపీదిగా వర్ణించింది. తాజాగా అస్సాం పర్యటనలో ప్రధాని మోడీ రూ. 498 కోట్లతో కామాఖ్య దివ్యలోక్ పరియోజన కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్లలో అస్సాంలో శాంతి నెలకొందని, 7,000 మందికి పైగా ప్రజలు ఆయుధాలను వదిలేశారని అన్నారు. మొత్తం రూ.11,600 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోడీ ఆవిష్కరించారు.