Mallikarjun Kharge: పహల్గామ్ ఉగ్రదాడి భారత దేశంపై దాడిగా భావించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఉగ్ర వాదులకు కేంద్ర ప్రభుత్వం గట్టి సమాధానం ఇవ్వాలి అని కోరారు. జాతీయ భద్రతపై కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి అన్నారు. ఉగ్రవాదులను వేటాడి మట్టుబెట్టేలా ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగించాలి అని ఆయన చెప్పుకొచ్చారు. ఉగ్రవాద సవాలును ఏకాభిప్రాయంతో పరిష్కరించడానికి, ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరపాలి.. ఇది రాజకీయాలు చేయడానికి సమయం కాదని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
Read Also: CM Chandrababu: వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులు
ఇక, ఉగ్రవాదాన్ని దాని మూలాల నుంచి నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం, సహకారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ఎదుర్కుంటుంది.. మా అగ్ర నాయకత్వం ఈ పోరాటంలో తమ ప్రాణాలను కూడా త్యాగం చేసింది అని చెప్పుకొచ్చారు. ఇక, అమర్ నాథ్ యాత్రికులకు రక్షణ కల్పించాలి, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలి అని మల్లికార్జున ఖర్గే కోరారు.