సాధించాలనే పట్టుదల ఉంటే అసాధ్యమనేది ఉండదని పెద్దవాళ్లు చెబుతుంటారు. అది నిజమని ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కూడా రుజువు చేశారు. జీవితంలో సక్సెస్ అయిన ప్రతి బిజినెస్ మ్యాన్ మొదట చెప్పే మాట కూడా ఇదే. తాజాగా మరోసారి దీన్ని రుజువు చేశాడు కర్ణాటకకు చెందిన రేణుకా ఆరాధ్య. ‘పెదవాడిగా పుట్టడం నీ కర్మఫలం కావచ్చు.. కానీ అదే పేదవాడిగా చనిపోతే మాత్రం నీ తప్పే అవుతుంది’ అని ఓ కవి చెప్పిన మాటను రేణుకా ఆరాధ్య బాగా ఫాలో అయ్యాడు. ఆ సక్సెస్ మంత్రతో పట్టుదలతో బిక్షగాడి నుంచి బిలియనీర్‌గా ఎదిగాడు. మరి ఇందుకోసం రేణుకా ఆరాధ్య పాటించిన సక్సెస్ మంత్ర ఏంటో ఈ స్టోరీలో చదవండి!
కుటుంబం కోసం భిక్షాటన
రేణుకా ఆరాధ్యది ఓ పేద కుటుంబం. కర్ణాటకలోని ఓ చిన్న గ్రామంలో వారు నివసించేవారు. కనీసం మూడు తినడానికి కూడా తిండి ఉండేది కాదు. అలాంటి పేదరికంలోనూ రేణుకా ఆరాధ్య పదో తరగతి వరకు చదివాడు. ఆ తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా మారడంతో చదువు మానేసి కుటుంబం కోసం భిక్షాటన చేశాడు. ఇంటింటికీ వెళ్లి బియ్యం, పప్పు, పిండి కోసం అడుక్కోవాల్సి వచ్చింది. డబ్బుల కోసం ఇళ్లల్లో పని చేసేవాడు. అలా వచ్చే డబ్బు సరిపోకవడంతో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం సంపాదించాడు. దానితో పాటు ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరిలో కూడా ఉద్యోగిగా చేరాడు.
పట్టుదల కోసం పెళ్లి..
అదే సమయంలో రేణుకా ఆరాధ్యకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది.పెళ్లయితే కుటుంబ బాధ్యత పెరిగి తనలో ఇంకా పట్టుదల పెరుగుతుందని నమ్మి.. 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాడు. సూట్‌కేసు కవర్స్ వ్యాపారం మొదలు పెట్టాడు. దానిలో నష్టం రావడంతో అప్పుల పాలు అయ్యాడు. అది తీర్చడం కోసం ఓ ట్రావెల్ ఎజెన్సీలో డ్రైవర్‌గా చేరాడు. అలా నాలుగు సంవత్సరాలు డ్రైవర్‌గా పని చేసిన రేణుకా ఆరాధ్యకు సొంతగా ట్రావెల్ ఏజెన్సీ నడపాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ప్రవాసీ క్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక్క కారుతో వ్యాపారం మొదలు పెట్టాడు. మరుసటి ఏడాదికి మరో కారు కొన్నాడు.
ఇంతలో ఓ ట్రావెల్ ఏజెన్సీ తన వ్యాపారాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దింతో 6 లక్షలకు రేణుకా ఆరాధ్య ఆ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. ఆ సమయంలో కంపెనీకి 35 క్యాబ్‌లు ఉండేవి. అలా మొదలైన తన ట్రావెట్ బిజినెస్ మెల్లిమెల్లిగా లాభాలు చూపించింది. దీంతో అమెజాన్ ఇండియా ప్రమోషన్ కోసం అతడి కంపెనీని ఎంచుకుంది. వాల్‌మార్ట్ అండ్ జనరల్ మోటార్స్ వంటి కంపెనీలు కూడా వారితో కలిసి పనిచేయడం ప్రారంభించాయి. క్రమంగా కంపెనీ టర్నోవర్ పెరగి.. అతడి సంపాదన రూ.40 కోట్లు వరకు చేరుకుంది. అలా నేడు రేణుకా ఆరాధ్య బిలియనీర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం అతడి దగ్గర 1000 కార్లు ఉండగా అందులో 250 కార్లు అతడి సొంతం కొన్నవే. ఇక వేల సంఖ్యలో ఉద్యోగులు అతడి దగ్గర పని చేస్తున్నారు.