మహారాష్ట్రలో ఓ మహిళా వైద్యురాలి (26) ఆత్మహత్య సంచలనంగా మారింది. సతారా జిల్లా ఆస్పత్రిలోనే వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసిపెట్టింది. ఎస్ఐ గోపాల్ బడ్నే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆరోపించింది. ఐదు నెలల్లో పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. అతడి వేధింపుల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది.

ఇక సూసైడ్ నోట్‌లో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఎంపీ, అతడి సహాయకుల నుంచి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయని ఆరోపించింది. ఇక వైద్య పరీక్షలకు తీసుకురాకుండానే నిందితులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలంటూ పోలీసులు పదేపదే తనపై ఒత్తిడి తెచ్చారని తెలిపింది. అందుకు నిరాకరించడంతో ఎస్‌ఐ గోపాల్ బడ్నేతో పాటు మరికొందరు పోలీసు అధికారులు తనను వేధింపులకు గురిచేశారని ఆరోపించింది. ఇక ఎస్‌ఐ గోపాల్ బడ్నే తనపై ఐదు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడని.. పైగా మానసికంగా, శారీరకంగా హింసించాడని వాపోయింది. ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్‌పై కూడా ఇవే రకమైన ఆరోపణలు వైద్యురాలు చేసింది.
ఇది కూడా చదవండి: Osama bin Laden: ఆ సమయంలో లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నాడు.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి
సూసైడ్ నోట్ ఆధారంగా ఎస్ఐ గోపాల్ బడ్నే, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే విచారణలో ఎస్‌ఐ గోపాల్ బడ్నే-వైద్యురాలు బంధువులేనని తేలింది. బంధువు ముసుగులో ఎస్‌ఐ.. వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Machado: వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ.. నోబెల్ గ్రహీత మచాడో వెల్లడి
ప్రస్తుతం ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. బీజేపీ కూటమి ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు నామ్‌దేవ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌లో కీలక పోస్టు పెట్టారు. రక్షించాల్సి పోలీసులే.. వైద్యురాలిపై వేధింపులకు పాల్పడటాన్ని తప్పుబట్టారు. తొలుత ఆమె పై అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే పోలీసులను రక్షిస్తోందని.. అందుకే దురాగతాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఆరోపణలను బీజేపీ నాయకురాలు చిత్ర వాఘ్ ఖండించారు. ఇది సంఘటన దురదృష్టకరమని, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని హామీ ఇచ్చారు.