Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మరోసారి ‘‘ఖేలా హోబే’’ నినాదంతో బీజేపీకి సవాల్ విసిరింది. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు మరింత దూకుడుగా రాజకీయ ఆటను ప్రారంభించింది. ఆమె టీఎంసీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఆట మళ్లీ ప్రారంభమైంది(ఖేలా అబర్ హోబే)’’ అంటూ నినదించారు.
ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకున్న మమతా బెనర్జీ.. ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించడానికి వెనకడానని సవాల్ చేశారు. ‘‘ నేను 26 రోజులు ధర్నా చేయగలిగితే, ఎన్నికల కమిషన్ ముందు చేయవచ్చు. దీని వల్ల ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుంది’’ అని ఆమె అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అణగదొక్కే ఏ ప్రయత్నానైనా తన పార్టీ ఎదురు నిలుస్తుందని చెప్పారు. మనం మహారాష్ట్రలా కాదు, అని పేర్కొంటూ బీజేపీపై విమర్శలు చేశారు.
Read Also: KTR : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శల వర్షం
ఆమె ఎన్నికల్లో పార్టీలకు మద్దతుగా ఏజెన్సీలు పనిచేయడం గురించి, ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఐ-ప్యాక్ గురించి మాట్లాడారు. తన పార్టీకి పీకేతో సంబంధం లేదని, ఐప్యాక్‌తో ఇప్పుడు ఆయనకు సంబంధ లేదని చెప్పారు. ఆయన వేరే రాజకీయ పార్టీ పెట్టుకున్నారని దీదీ చెప్పింది. పార్టీ ఎన్నికల వ్యూహాల్లో కన్సల్టెన్సీ పాత్రని కూడా ఆమె సమర్థించారు. బీజేపీకి 50 ఏజెన్సీలు పనిచేస్తున్నాయని, టీఎంసీకి ఒక్కటి ఉండటం సమస్య కాకూడదని ఆమె అన్నారు.
మరోవైపు, బయటి వ్యక్తుల్ని ఓటర్ల జాబితాలో బీజేపీ చేర్పిస్తోందని ఆమె ఆరోపించారు. డేటాను తారుమారు చేయడానికి అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ అనే గ్రూపుని మోరిస్తుందని పేర్కొన్నారు. హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తుల పేర్లను బెంగాల్ ఓటర్ల జాబితాలో చేర్చారని, ఇది ఆన్‌లైన్ ద్వారా జరుగుతోందని ఆమె ఆరోపిస్తూ , కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ బెంగాల సాంస్కృతిక గుర్తింపుని తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వారు మహారాష్ట్ర, ఢిల్లీలో ప్లే చేసిన ట్రిక్ బెంగాల్‌లో కుదరదని చెప్పారు.