Time Use Survey: కేంద్రం విడుదల చేసిన టైమ్ యూజ్ సర్వే 2024లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయులు పనిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నట్లు సర్వేలో తేలింది. స్వీయ సంరక్షణ, నిర్వహణపై తక్కువ సమయం గడుపుతున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వ సర్వే ప్రకారం.. రోజులో ఉపాధి, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పురుషులు, మహిళలు(15-59 సంవత్సరాలు) పాల్గొనడటం 75 శాతం, 25 శాతానికి పెరిగింది. ఇది 2019లో 70.9 శాతం, 21.8 శాతంగా ఉండేది.
మరోవైపు భారతీయులు తమ సొంత సంరక్షణ, నిర్వహణ గురించి గడిపే సగటు సమయం రెండు శాతం తగ్గిందని వెల్లడించింది. 2019లో మొదటిసారి నిర్వహించిన టైమ్ యూజ్ సర్వేలో పెయిడ్, అన్ పెయిడ్ కార్యకలాపాల్లో పురుషులు, మహిళలు ఇద్దరి సమయాన్ని పరిశీలించింది. ఇందులో ఇంట్లో ఫ్రీగా నిర్వహించే గృహసేవలు, సంరక్షణ కార్యకలాపాలు, స్వచ్చంద సేవ, శిక్షణ వంటివి కూడా ఉన్నాయి. ఇది ఉపాధి సంబంధిత కార్యక్రమాలు, సెల్ఫ్ కేర్, నేర్చుకోవడం, సోషలైజింగ్, విశ్రాంతి కార్యకలాపాలు వంటి వాటిపై గడిపే సమయాన్ని గురించి సమాచారాన్ని అందిస్తోంది.
జనవరి – డిసెంబర్ 2024 మధ్య నిర్వహించిన తాజా ‘టైమ్ యూజ్ సర్వే’ రెండో జాతీయ సర్వే. ఈ సర్వే 1.39 లక్షల కుటుంబాల నుంచి ఆరు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల 4.45 లక్షల మందిని కవల్ చేసింది.
Read Also: Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్ ముందు ముగిసిన మాజీ ఈఎన్సీల విచారణ
సర్వేలో కీలక విషయాలు వెల్లడి:
*2024లో ఆరు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న భారతీయులలో 41 శాతం మంది ఉపాధి మరియు సంబంధిత కార్యకలాపాలలో పాల్గొన్నారు, ఇది 2019 నుండి దాదాపు 3 శాతం పాయింట్లు పెరిగింది. సగటున, భారతీయులు రోజుకు 440 నిమిషాలు ఉపాధి కోసం వెచ్చిస్తున్నారు.
* ఎలాంటి చెల్లింపులు లేని గృహ సేవలకు సగటున గడిపిన సమయం 129 శాతంగా ఉంది. ఇది 2019 నుంచి 2 శాతం తగ్గింది. గృహ సభ్యులకు ఎలాంటి చెల్లింపులు లేని గృహ సేవల్లో మహిళలు రోజుకు సగటున 289 నిమిషాలు గడపగా, పురుషులు 88 నిమిషాలు గడిపారు.
* పురుషులు తమ ఇంటి సభ్యుల్ని చూసుకోవడానికి ఒక రోజులో 75 నిమిషాలు గడుపగా, ఆడవాళ్లు రెట్టింపు సమయం, అంటే 137 నిమిషాలు గడిపారు.
* 6-14 ఏళ్ల వయసు ఉన్న పిల్లల్లో 89.3 శాతం మంది లర్నింగ్ కార్యకలాపాల్లో నిమగ్నమై, రోజుకు 413 నిమిషాలు కేటాయించారు.
* 6 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఒక రోజులో సగటున 171 నిమిషాలు కల్చర్, విశ్రాంతి, మాస్ మీడియా వినియోగానికి సంబంధించిన కార్యకలాపాలలో గడిపారు. పురుషులు, మహిళలు ఒక రోజులో వరుసగా 177 నిమిషాలు ,164 నిమిషాలు ఇటువంటి కార్యకలాపాలలో గడిపారు.
* 2019లో భారతీయులు రోజుకు 130 నిమిషాలు గడిపిన దానికంటే, 2014లో సామాజికంగా సంభాషించడం, సమాజ భాగస్వామ్యం, మతపరమైన ఆచారాల కోసం ఐదు నిమిషాలు తక్కువ సమయం గడిపారు.