Bengaluru Shocker: బెంగళూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ, ఓ టెక్కీ తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఆర్‌ఎంవీ 2వ స్టేజ్ ప్రాంతంలోని అద్దెకు ఉంటున్న సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్, తన కుటుంబంతో సహా శవాలుగా కనిపించారు. హత్యా-ఆత్మహత్య అనే అనుమానంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Ponguleti Srinivas Reddy: రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించడమే మా లక్ష్యం..
మృతులను అనుప్ కుమార్ (38), అతని భార్య రాఖీ (35), వారి 5 సంవత్సరాల కుమార్తె అనుప్రియ, 2 సంవత్సరాల కుమారుడు ప్రియాంష్‌గా గుర్తించారు. ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌కి చెందిన అనూప్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. సోమవారం ఇంట్లో పనిచేసే వారు వచ్చారు. అయితే, ఎంత ప్రయత్నించినప్పటికీ ఎవరూ డోర్ తెరవకపోవడంతో ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో దంపతులతో పాటు వారి ఇద్దకు పిల్లల మృతదేహాలను గుర్తించారు.
అనూప్, రాఖీలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి ముందు వారి పిల్లలకు విషమిచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దంపతులు మొదటి బిడ్డ ఆరోగ్యం విషయంలో మానసికంగా ఇబ్బందిపడుతున్నట్లు తేలుస్తోంది. అనుప్రియ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్ల, దీంతో తల్లిదండ్రులు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అయితే, దంపతులు సంతోషంగా ఉన్నారని, పాండిచ్చేరి సందర్శించే ప్లాన్‌లో ఉన్నారని ఇంట్లో పనిచేస్తున్నవారు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. వారి పిల్లల సంరక్షణ చూసుకోవడానికి ముగ్గురు వ్యక్తుల్ని పనిలో పెట్టుకున్నారని, ఒక్కొక్కరికి నెలకు రూ. 15000 జీతం ఇస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదు.