Supreme Court: ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించించింది. ఈ కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది. కేంద్రం అభిప్రాయం మేరకు కేసు విచారణ చేపడుతామని అత్యున్నత ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు కేసుకు సంబంధించిన పిటిషన్లను సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు అందచేస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఢిల్లీలో ఉబర్, ర్యాపిడో వంటి బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్లపై అక్కడి ప్రభుత్వం నిషేధించింది. నాన్ ట్రాన్స్ పోర్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించడం, మోటార్ వాహన చట్టం(1988)ని ఉల్లంఘించడమే అని రవాణా శాఖ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ వివాదం మొదలైంది.
Read Also: AP Special Category Status: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదు.. వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంతో ఉబర్, ర్యాపిడో ముందుగా హైకోర్టును ఆశ్రయించగా.. ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో ఓ విధానం రూపొందించే వరకు బైక్ ట్యాక్సీ సేవలను కొనసాగించేందుకు అనుమతిచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో శుక్రవారం జస్టిస్ అనిరుధ బోస్, జస్టిస్ రాజేశ్ బిందాల్ తో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు పిటిషన్లను సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు అందచేయాలని కోర్టు సిబ్బందికి సూచించింది. వాటిని పరిశీలించిన తర్వాత కేంద్రం తన అభిప్రాయాన్ని తెలియజేస్తే, దాన్ని పరిగణలోకి తీసుకొని విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.