యెమెన్‌లో ఉరిశిక్ష పడిన భారత సంతతి నిర్సు నిమిషా ప్రియకు ప్రస్తుతం ఊరట లభించింది. నిమిషా ప్రియకు ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. అయితే ఈ కేసులో బాధిత కుటుంబంతో మాట్లాడేందుకు తాము యెమెన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిమిషా తరఫున బృందం సుప్రీంకోర్టును కోరింది. ఈ అంశం తమ పరిధిలో లేదని.. కేంద్ర ప్రభుత్వం దగ్గరకే వెళ్లాలని సూచించింది. ప్రస్తుతం ఆ దేశానికి వెళ్లకుండా ప్రయాణ ఆంక్షలు ఉన్నందున దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వం దగ్గర అభ్యర్థన చేసుకునేలా పిటిషనర్లకు అనుమతి కల్పించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Felix Baumgartner: సూపర్‌సోనిక్ స్కైడైవ్ మార్గదర్శకుడు ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ కన్నుమూత
నిమిషా ప్రియ కేసును శుక్రవారం సుప్రీం ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. నిమిషా ప్రియకు మరణశిక్ష అమలును యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని న్యాయస్థానం దృష్టికి కేంద్రం తీసుకెళ్లింది. ఆమెను క్షేమంగా స్వదేశానికి తిరిగిరావాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్రియ కేసులో కేంద్రం సాధ్యమైన ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. దీంతో ప్రభుత్వం స్పందనపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో 20 స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు.. విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన
అసలు నిమిషా ప్రియ ఎవరు..?
నిమిషా ప్రియ కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నర్సు. 2008లో మంచి జీతం కోసం యెమెన్‌కు వెళ్లారు. అక్కడ ఆసుపత్రుల్లో పనిచేసిన తర్వాత, తన సొంత క్లినిక్‌ను స్థాపించేందుకు యెమెన్‌కు చెందిన తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తితో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కానీ ఈ భాగస్వామ్యం ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రియ చెప్పిన దాని ప్రకారం.. తలాల్ ఆమెను శారీరకంగా, ఆర్థికంగా వేధించాడు. ఆమె పాస్‌పోర్ట్ ను కూడా దొంగిలించాడు. ఈ బాధల నుంచి తప్పించుకునేందుకు ప్రియ 2017లో తలాల్‌కు సెడేటివ్స్ ఇంజెక్ట్ చేసింది. కానీ అది వికటించడంతో మహదీ మరణించాడు. దీంతో నిమిషా ప్రియ అరెస్ట్ అయ్యారు. 2020లో యెమెన్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. 2023లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ ఈ తీర్పును ధృవీకరించింది. 2024 చివర్లో యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలీమీ ఈ శిక్షను ఆమోదించారు. 2025 జులై 16 నాటికి నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఊరట లభించింది.