Stray Dogs Attack: కుక్కల దాడుల్లో అమాయకపు పిల్లలు దారుణంగా మరణిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కుక్కల దాడుల వల్ల చాలా మంది మరణించారు. ఇదిలా ఉంటే మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ మహారాజ్ గంజ్ ప్రాంతంలో వీధికుక్కల దాడుల్లో 11 ఏళ్ల బాలుడు బలయ్యాడు. మహారాజ్‌గంజ్‌లోని శాస్త్రి నగర్ ఇంటర్మీడియట్ కళాశాల మైదానంలో 11 ఏళ్ల బాలుడిని వీధికుక్కలు కొట్టి చంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
Read Also: Rajendranagar Crime: దేవుడు చెప్పాడని ఒంటికి నిప్పు పెట్టుకున్న మహిళ
ఆదర్శ్ అనే బాలుడు మార్కెట్ వెళ్లేందుకు సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరారు. అతను తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకడం ప్రారంభించారు. కుక్కల దాడిలో తీవ్రగాయాల పాలైన బాలుడి మృతదేహం అర్థరాత్రి దొరికింది. అతని ముఖం, కుడి చేయిపై తీవ్రగాయాలయ్యాయి. దాడి నుంచి తనను తాను రక్షించుకునేందుకు బాలుడు చాలా ప్రయత్నించినట్లు కనిపించిందని పోలీస్ అధికారులు వెల్లడించారు. కుక్కల గుంపు బాలుడిపై దాడి చేయడం వల్లే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
AIIMS అధ్యయనం ప్రకారం, కుక్కకాటు మరియు ఇతర జంతువుల కాటు వల్ల వచ్చే రేబిస్ కారణంగా ప్రతి సంవత్సరం 18,000 నుండి 20,000 మంది మరణిస్తున్నారని ICMR వెల్లడించింది. దేశంలో 93% రేబిస్ మరణాలు కుక్క కాటు వల్లనే సంభవిస్తున్నాయనేది వెలుగులోకి వచ్చింది. ఇందులో 63% వీధి కుక్కల వల్ల వస్తుంది. పట్టణాల్లో 60%, గ్రామాల్లో 64% వీధికుక్కల ద్వారా మరణాలు సంభవిస్తున్నాయి. అయితే.. భారత్‌లో 2 కోట్ల కుక్కలు ఉండగా అందులో వీధికుక్కల సంఖ్య 1.53 కోట్లు ఉంది. ICMR అధ్యయనం ప్రకారం, వీధి కుక్కల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోవడమే. అందుకే చెత్తకుప్పల దగ్గర వీధికుక్కలు ఎక్కువవుతున్నాయి.