MK Stalin: హిందీ వివాదం, డీలిమిటేషన్‌పై కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. సీఎం స్టాలిన్‌తో పాటు అధికార డీఎంకే పార్టీ నేతలు కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. డీలిమిటేషన్ తమ హక్కుల్ని కాలరాస్తాయని, రాష్ట్రంలో ఎంపీ సీట్లు తగ్గుతాయని స్టాలిన్ చెబుతున్నారు. ముఖ్యంగా జనాభా నియంత్రణలో మెరుగుగా వ్యవహరించిన దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని స్టాలిన్ వాదిస్తున్నారు. అయితే, ఒక్క సీటు కూడా తగ్గదని కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ, ఈ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
Read Also: KCR: 3 గంటలు సుదీర్ఘ చర్చలు.. పార్టీ నేతలతో ముగిసిన కేసీఆర్ మీటింగ్
ఇదిలా ఉంటే, డీలిమిటేషన్‌కి వ్యతిరేకంగా ‘‘జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)’’ని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన సమావేశం మార్చి 22న చెన్నైలో జరగనుంది. ఈ సమావేశానికి ఏడుగురు రాష్ట్ర నాయకులను స్టాలిన్ చెన్నైకి ఆహ్వానించారు. ఆహ్వానం అందుకున్న వారిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి ఉన్నారు. ఈ మేరకు ఆయన ఏడుగురు ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. వీరంతా జేఏసీలో చేరాలని కోరారు.