Spy Camera: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ స్కూల్ డైరెక్టర్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. టీచర్లు వినియోగించే బాత్రూంలో స్పై కెమెరాను అమర్చి.. తన కంప్యూటర్, మొబైల్ ఫోన్లో మానిటరింగ్ చేస్తుండగా.. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవనీష్ సహాయ్ అనే వ్యక్తి నోయిడా సెక్టార్ 70లోని ప్లే స్కూల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 10వ తేదీన ఓ టీచర్ బాత్రూంలోని బల్బ్ హోల్డర్‌లో స్పై కెమెరా ఉన్న విషయాన్ని గుర్తించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ నవనీష్ తో పాటు స్కూల్ కోఆర్డినేటర్ పరుల్ దృష్టికి సదరు మహిళ టీచర్ తీసుకెళ్లగా వారు దీన్ని తోసిపుచ్చారు.
Read Also: Revanth Reddy Protest: రోడ్డెక్కిన సీఎం.. కాంగ్రెస్ భారీ ర్యాలీ
ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీచర్స్ ఆరోపించారు. ఈ క్రమంలోనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇక, దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా.. స్కూల్ డైరెక్టరే స్పై కెమెరా పెట్టినట్లు తేలింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసి.. విచారణ చేయగా.. రూ.22 వేలకు ఆ కెమెరాను ఆన్‌లైన్లో కొన్నట్లు నిందితుడు నవనీష్ ఒప్పుకున్నాడు. అలాగే, గతంలోనూ స్కూల్ బాత్రూంలో స్పై కెమెరాను కనుగొన్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని పాఠశాల కోఆర్డినేటర్ కు అందజేయగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉపధ్యాయ సిబ్బంది ఆరోపించారు. దీనిపై విచారణ కొనసాగుతుండటంతో.. స్కూల్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు పోలీసులు వెల్లడించారు.