Direct-to-Mobile: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్. సిమ్ కార్డ్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కూడా వీడియోలు చూసే రోజులు త్వరలో రాబోతున్నాయి. సమీప భవిష్యత్తులో డైరెక్ట్-టూ-మొబైల్ ప్రసారాలు నిజం అయ్యే అవకాశం ఉంది. బ్రాడ్‌కాస్టింగ్ సమ్మిట్‌ని ఉద్దేశిస్తూ సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడుతూ.. డైరెక్ట్-టూ-మొబైల్(D2M) సాంకేతికత అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు.
D2M సాంకేతికత ట్రయల్స్ త్వరలో 19 నగరాల్లో జరుగుతాయని, దీని కోసం 470-582 MHz స్పెక్ట్రమ్‌ను రిజర్వ్ చేయడానికి కార్యాచరణ రూపొందించామని ఆయన వెల్లడించారు. 25-30 శాతం వీడియో ట్రాఫిక్‌ని D2M మార్చడం వల్ల ఆటంకం లేకుండా 5G నెట్‌వర్క్‌ని పొందొచ్చని, దీనివల్ల దేశ డిజిటల్ పరిణామం మరింత వేగవంతమవుతుందని అపూర్వ చంద్ర అన్నారు.
Read Also: Flight Delay: ఎయిర్‌పోర్టుల్లో వార్ రూమ్స్.. ఫ్లైట్స్ ఆలస్యంపై కేంద్రం ప్రణాళిక..
గతేడాది D2M సాంకేతికతను పరీక్షించడానికి పైలట్ ప్రాజెక్టులు బెంగళూరు, కర్తవ్య పథ్, నోయిడాలో జరిగాయి. ఈ టెక్నాలజీ దేశవ్యాప్తంగా 8-9 కోట్ల టీవీలు లేని ఇళ్లకు చేరుకోవడానికి సాయపడుతుందని, దేశంలో 280 మిలియన్ కుటుంబాల్లో కేవలం 190 మిలియన్ కుటుంబాల్లోనే టీవలు ఉన్నాయి. దేశంలో 80 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, 69 శాతం కంటెంట్ వీడియో ఫార్మాట్ లో ఉందని చెప్పారు. వీడియోలను ఎక్కువ ఉపయోగించడం వల్ల మొబైల్ నెట్వర్క్ స్లో అవుతోందని, దీని ఫలితంగా కంటెంట్ బఫర్ అవుతుందని వెల్లడించారు.
సాంఖ్యాల్యాబ్, ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన D2M టెక్నాలజీ టెరిటోరియల్ టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ అసైన్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్స్ నేరుగా దీనిని సపోర్ట్ చేసే మొబైల్స్, స్మార్ట్ ఫోన్లకు చేరడానికి ఉపయోగిపడుతుంది. ఒక బిలియన్ మొబైల్ ఫోన్లకు చేరుకోగల సామర్థ్యంతో, D2M టెక్నాలజీని స్వీకరించడం వల్ల డేటా ట్రాన్స్మిషన్, డేటా యాక్సెస్ ఖర్చు తగ్గుతుంది. నెట్వర్క్ సామర్థ్యం పెరగడంతో పాటు నేషనల్ అలర్ట్ సిస్టమ్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడాన్ని సులభతరం చేస్తుంది.