కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నట్లు, స్వల్పంగా జ్వరం ఉన్నట్లు కాంగ్రెస్ అధకార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా ప్రకటించారు. కరోనా నుంచి సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రార్థిస్తున్నారు. కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కోరుకున్నారు.
నిన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. జూన్ 8న సోనియాగాంధీని ఈడీ పిలిచింది. ఇదే విధంగా ఎంపీ రాహుల్ గాంధీని కూడా హాజరుకావాల్సిందిగా కోరింది. అయితే రాహుల్ విదేశాల్లో ఉండటంతో జూన్ 5 తర్వాతే ఈడీ విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సోనియాగాంధీకి కరోనా సోకడంతో ఈడీ ముందు హాజరయ్యేందుకు మరో తేదీని కోరవచ్చు.
ఇదిలా ఉంటే ఈడీ మనిలాండరింగ్ కేసులపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు. కేంద్రానికి ఎదురుగా నిలుస్తున్నామనే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక బీజేపీ ఈడీ,ఐటీ వంటి కేంద్ర సంస్థలను ఉపయోగిస్తోందని విమర్శలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదురించిన కాంగ్రెస్ పార్టీ, సోనియా, రాహుల్ గాంధీలు ఈడీ కేసులకు భయపడరని.. పోరాడుతాం..గెలుస్తాం.. తలవంచబోం అని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో పేర్కొంది.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఈడీ ఎదుట హాజరవుతారని.. మేం కేసులను ఎదుర్కొంటాం అని.. ఇలాంటి వ్యూహాకు భయపడం అని పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ బుధవారం బీజేపీని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇలాంటి కేసులను కక్షపూరితంగా పెడుతోందని.. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని..దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని రణ్ దీప్ సుర్జేవాాలా విమర్శించారు.