‘‘మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు’’ అంటూ ఓ గేయ రచయిత సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలను చూసి చలించి రాసిన పాట ఇది. ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. భార్యాభర్తల మధ్య.. రక్తసంబంధికుల మధ్య బంధాలు క్షీణిస్తున్నాయి. అనంతరం ప్రతీకారంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. కలకాలం తోడుండాల్సిన భార్యనే కడతేర్చాడు ఓ భర్త. ఈ సంఘటన నోయిడాలో చోటుచేసుకుంది.
నూరుల్లా హైదర్(55), అస్మా ఖాన్ (42) భార్యాభర్తలు. అస్మా ఖాన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. నోయిడాలోని సెక్టార్ 15 ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అస్మా ఖాన్.. మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేసింది. భర్త హైదర్ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేశాడు. అయితే ప్రస్తుతం అతను నిరుద్యోగిగా ఉన్నాడు. వీళ్లిద్దరికీ 2005లో వివాహం జరిగింది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు ఇంజనీరింగ్ చదువుతుండగా.. కుమార్తె 8వ తరగతి చదువుతోంది.
అయితే చాలా రోజుల నుంచి అస్మా ఖాన్‌పై హైదర్ అనుమానం పెట్టుకున్నాడు. భార్యకు అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తున్నాడు. దీనిపై అనేక రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కూడా మరోసారి ఘర్షణ జరిగింది. దీంతో సుత్తి తీసుకుని అస్మా ఖాన్ తలపై కొట్టగా అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కుమారుడు 112 నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు దర్యాప్తు చేయగా.. భార్యకు అక్రమ సంబంధం ఉందన్న కారణంతోనే చంపినట్లుగా పోలీసులు తెలిపారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాంబదన్ సింగ్ తెలిపారు. సమాచారం అందగానే ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనాస్థలికి వెళ్లినట్లు పేర్కొ్న్నారు. ప్రాథమిక దర్యాప్తులో భార్యకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు తేలిందన్నారు. భార్యాభర్తల మధ్య చాలా రోజుల నుంచి గొడవలు ఉన్నట్లుగా బాధితురాలి సోదరుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.