Sitaram Yechury comments on BJP: ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) అధ్యక్షుడు, మాజీ హర్యానా ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా శుక్రవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిశారు. దివంగత చౌదరి దేవీలాల్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 25న ఫతేహాబాద్ లో జరిగే ర్యాలీకి హాజరుకావల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా వారిద్దరు దేశంలో విపక్షాల ఐక్యతపై మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయని.. ఇది మంచి పరిణామం అని సీతారాం ఏచూరి అన్నారు. దేశాన్ని ప్రజలను, రాజ్యాంగాన్ని, ప్రజల బతుకుదెరువును కాపాడాలంటే బీజేపీని అధికారంలోంచి దించాలని ఆయన అన్నారు. కేసీఆర్ తో రాష్ట్రస్థాయిలో పనిచేసిన తర్వాత దాని ఆధారంగా జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం వస్తుందని ఆయన అన్నారు.
మనుగోడులో బీజేపీని ఓడించేది టీఆర్ఎస్సే అని ఏచూరి అన్నారు. అందుకే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని అన్నారు. బీజేపీకి వ్యతరేకంగా కాంగ్రెస్, ఆప్, వామపక్షాలు వారివారి పోరాటాలను కొనసాగిస్తున్నాయని.. 2024లో బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 400 సీట్లు రావని.. ఓటమి తథ్యం అని వ్యాఖ్యానించారు.
Read Also: Nupur Sharma: నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలనే పిటిషన్‌ను నిరాకరించిన సుప్రీంకోర్టు
ఓం ప్రకాష్ చౌతాలా కూడా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. మతం, కులం పేరుతో దేశాన్ని విభజించిన బీజేపీ తీరుపై దేశంలోని ప్రతీ పౌరుడు విచారం వ్యక్తం చేస్తున్నాడని అన్నారు. బీజేపీ దేశాన్ని ప్రేమించదని.. వారు డబ్బుతో రాజకీయం చేస్తున్నారని.. దేశాన్ని దోచుకోవడంలో నిమగ్నమై ఉన్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. ఖచ్చితంగా ప్రజలు ప్రతిపక్షాలకు అండగా నిలుస్తారని చౌతాలా అన్నారు. 2024లో అధికార మార్పిడి ఉంటుందని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 25న ఫతేహాబాద్‌లో ఐఎన్‌ఎల్‌డీ నిర్వహించనున్న గౌరవ దినోత్సవ ర్యాలీకి నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, శరద్ పవార్, మమతా బెనర్జీ హాజరుకానున్నారు.