Supreme Court denies to entertain plea seeking Nupur Sharma’s arrest: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేయాలంటూ అందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను శుక్రవారం తోసిపుచ్చింది. ఈ పిటిషన్ ఉపసంహరించుకోవాలని సూచించింది. దీంతో పిటిషనర్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. గత నెలలో నుపుర్ శర్మపై ఎలాంటి బలవంతపు చర్య తీసుకోకూడదని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. దేశ వ్యాప్తంగా ఆమెకు వ్యతిరేకంగా నమోదైన ఎఫ్ఐఆర్ ల ఆధారంగా నుపుర్ శర్మపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని.. ఆమెపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఢిల్లీకి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.
అయితే గతంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పార్థివాలాతో కూడిన ధర్మాసనం నుపుర్ శర్మపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు చేసిన ఈ వ్యాఖ్యలపై దేశంలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నుపుర్ శర్మను దేశభద్రతకు ముప్పుగా.. దేశం అంతటా భావోద్వేగాలు రగిలించిన తీరుకు ఆమె ఒక్కరిదే బాధ్యత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
Read Also: Asia Cup 2022: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఫిక్సింగ్.. మూడు క్యాచ్‌లపై అనుమానం
నుపుర్ శర్మ ఓ టీవీ డిబెట్ లో మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశంతోొ పాటు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ముఖ్యంగా ముస్లిం దేశాలు నుపుర్ శర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆమెకు బెదిరింపులు వచ్చాయి. నుపుర్ శర్మకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని కొంతమంది మతోన్మాదులు దారుణంగా చంపేశారు. రాజస్థాన్ ఉదయపూర్ కు చెందిన కన్హయ్యలాల్ అనే దర్జీని అత్యంత పాశవికంగా తలనరికి హత్య చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అంతకుముందు మహారాష్ట్రలోని అమరావతిలో ఉమేష్ కుమార్ కోల్హే అనే వ్యక్తిని కూడా కొంత మంది దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతం ఈ రెండు హత్యలను ఎన్ఐఏ విచారిస్తోంది.