Deve Gowda: మాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) అధినేత దేవేగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో జేడీఎస్ పార్టీ పలుమార్లు బీజేపీకి సపోర్టు చేస్తూ మాట్లాడింది. కర్ణాటక ఎన్నికల అనంతంర ఆ పార్టీ తీరు మారింది. తాజాగా దేవేగౌడ కామెంట్స్ ని చూస్తే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక పక్షంలో ఉండరనే వాదనలు వినిపిస్తున్నాయి. కొత్త పార్లమెంట్ వేడుకలను కాంగ్రెస్ తో పాటు 20కి పైగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి. అయినా కూడా జేడీఎస్ తరుపున దేవెగౌడ హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ ఆయనను ఆప్యాయంగా పలకరించారు. ఇటీవల కోరమాండల్ ఎక్స్ ప్రెస్ దుర్ఘటన సమయంలో విపక్షాలు అన్నీ రైల్వే మంత్రి రాజీనామాకు పట్టుబట్టగా.. జేడీయూ ఆయనకు మద్దతుగా నిలిచింది.
ఇదిలా ఉంటే బీజేపీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధం లేని పార్టీని దేశంలో చూపించండి అంటూ దేవెగౌడ సవాల్ విసిరారు. దేశం మొత్తంలో ఒక్కపార్టీనైనా చూపించాలని, అప్పుడు నేను సమాధానం చెబుతానని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేస్తున్న విపక్ష ఐక్యత ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు దేవెగౌడ మంగళవారం సమధానమిచ్చారు.
Read Also: Bandi Sanjay: ప్రధాని మోడీ రైతు పక్షపాతి.. పంటలకు కనీసం మద్దతు ధర పెంచడం హర్షణీయం
మంగళవారం బెంగళూరులోని జేపీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవెగౌడ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీతో చేతులు కలపని పార్టీ ఏదైనా ఉంటే చూపించండి.. ఆ తర్వాత ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడతాను. పార్టీలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీతో చేతులు కలిపాయి. వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా ఉన్నారంటూ ఆయన కామెంట్స్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల గురించి జెడి(ఎస్) పార్టీ ఆందోళన చెందదని ఆయన అన్నారు.
ప్రస్తుతం కర్ణాటకలో జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ, బీబీఎంపీ ఎన్నికలు రానున్నాయ ని, ఈ ఎన్నికల్లో పార్టీకి లభించే ప్రజాభిమానాన్ని బట్టి లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని నియోజవర్గాల్లో, ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయాలనేది నిర్ణయిస్తామని అన్నారు. 2024 ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీలు కలిసి రావడంపై ప్రశ్నిస్తే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయాలన్నారు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని దేవెగౌడ స్పష్టం చేశారు.