Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. దాడి తర్వాత నుంచి 30 టీములతో నిందితుడిని పట్టుకునేందుకు ముంబై పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌లో దాడి చేసినట్లు భావిస్తున్న అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. దుర్గ్ జిల్లాలో జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు 31 ఏళ్ల ఆకాష్ కైలాష్ కన్నోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్‌గఢ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అదుపులోకి తీసుకుంది.
ఛత్తీస్‌గఢ్ ఆర్‌పీఎఫ్ ప్రకారం.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తి, తాము రైలులో అదుపులోకి తీసుకున్న వ్యక్తి పోలికలు ఒకేలా ఉన్నట్లు చెప్పారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రైలు దుర్గ్‌కి చేరుకున్నప్పుడు, జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. నిందితుడు ప్రయాణిస్తున్న రైలు, దాని లొకేషన్‌ని ముంబై పోలీసులు ఆర్‌పీఎఫ్‌కి పంపారు. ప్రస్తుతం నిందితుడు ఆర్‌పీఎఫ్ కస్టడీలో ఉన్నారు. నిందితుడిని ముంబై పోలీసులుతో వీడియో కాల్‌లో మాట్లాడించారు.
Read Also: CM Chandrababu : ఇలా చేస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది.. హత్యలు చేస్తే కాదు?
అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఈ సంఘటనలో పాల్గొన్న వ్యక్తినా లేక మరెవరైనా అని నిర్ధారించేందుకు ముంబై నుంచి ఒక టీమ్ దుర్గ్ వెళ్తోంది. రాత్రి 8 గంటల ప్రాంతంలో దుర్గ్‌కి చేరుకుంటుంది. సదరు వ్యక్తి టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు తేలింది. అతడిని ముందుగా ప్రశ్నించగా తాను నాగ్‌పూర్ వెళ్తున్నట్లు చెప్పాడని, తర్వాత బిలాస్‌పూర్ వెళ్తున్నట్లు చెప్పినట్లు ఆర్‌పీఎఫ్ చెప్పింది.
గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ నివాసంలోకి ప్రవేశించిన నిందితుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కి ఆరుచోట్ల గాయాలయ్యాయి. లీలావతి ఆస్పత్రికి వెంటనే తరలించడంతో ప్రమాదం తప్పింది. అతడి వెన్నెముకలో కత్తి విరిగి ఉండటంతో శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు దాన్ని తొలగించారు. మరుసటి రోజు, నిందితుడు బాంద్రా రైల్వే స్టేషన్‌లో కనిపించాడు. మరొక ఫోటోలో దాదార్ రైల్వే స్టేషన్‌లో కనిపించాడు. అతడు ముంబై నుంచి రైలులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల నిఘాకు నిందితుడు చిక్కినట్లు తెలుస్తోంది.