BRS: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీని మహారాష్ట్రలో కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇటీవల మహారాష్ట్ర రాజకీయాలపై ఫుల్ ఫోకస్ చేశారు. ఇటీవల నాగ్ పూర్ లో పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్ ఇతర తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ సమావేశాలకు, సభలకు ఎక్కువ మంది తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పార్టీలు బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి.
ఇప్పటికే మహారాష్ట్ర కీలక నేత, ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ సక్సెస్ కాదని, దేశంలో ఎక్కడైనా పార్టీలు పెట్టుకునే హక్కు ఉందని, అయితే ఇది బీజేపీ-బీ టీమ్ అవునా..? కాదా..? అనేది తేలాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే తాజా శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) మౌత్ పీస్ పత్రిక అయిన సామ్నాలో కేసీఆర్ టార్గెట్ గా దాడి ప్రారంభించింది. సీఎం కేసీఆర్, అతని పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ, మహారాష్ట్రలో ఓడిపోతుందని జోస్యం చెప్పింది.
Read Also: DK Shivakumar: “సిద్ధరామయ్య భయపడ్డారు..అదే నేనైతే”.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు..
‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత ఓడిపోయారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆమెను ప్రశ్నించింది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి, తెలంగాణలోని కొందరు మద్యం కాంట్రాక్టర్లకు మధ్య కవిత మధ్యవర్తిగా వ్యవహరించారు. ఫలితంగా , కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెపై విచారణ ప్రారంభించాయి. రాజకీయ ప్రేరేపిత ఒత్తిడితో విచారణను కేసీఆర్ తోసిపుచ్చారు, అయితే తిరిగి పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు. అయితే, కేసీఆర్ తీసుకున్న తదుపరి రాజకీయ చర్యలు బీజేపీకి పరోక్షంగా లాభిస్తాయి’’ అంటూ సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ని బీజేపీ పోటీలోకి దింపిందా..? అని సందేహాలను సామ్నా లేవనెత్తింది. తెలంగాణలో బీఆర్ఎస్ తన ప్రాబల్యాన్ని కోల్పోతోందని శివసేన ఆరోపించింది. మహారాష్ట్రలో అసంతృప్తుల కోసం కేసీఆర్ కొత్త వేదికను ఏర్పాటు చేశారని, ఈ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి, ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి సాయపడుతుందా..? ఈ చర్యల్ని స్థానిక ప్రజలు తగిన సమయాంలో గుర్తించాలని సామ్నా పేర్కొంది. కేసీఆర్ మహారాష్ట్రలో రైతులు ఓట్లను అడుగుతున్నారని.. మొత్తం సీన్ చూస్తే ఆయన పార్టీ బీఆర్ఎస్ ఓట్లను చీల్చి బీజేపీకి మార్గం సుగమం చేయాలని భావిస్తోందని సామ్నా ఆరోపించింది.