Rishabh Pant Undergoes Plastic Surgery On Forehead: కారు ప్రమాదంలో గాయపడిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. రిషబ్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించారు. ప్రస్తుతం డెహ్రాడూన్ ఆస్పత్రిలో రిషబ్ కు వైద్య చికిత్స కొనసాగుతోంది. రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ప్రముఖులు ఆరా తీస్తున్నారు. నిన్న రాత్రి పంత్ కుటుంబ సభ్యులతో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక బీసీసీఐ పంత్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు కుటుంబం, వైద్యులతో సంప్రదిస్తోంది. బాలీవుడ్ యాక్టర్లు అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్ గాయపడిన రిషబ్ పంత్ కుటుంబాన్ని పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read Also: Covid-19: భారత్‌తో సహా చైనాపై 10 దేశాల ఆంక్షలు
ఇదిలా ఉంటే పంత్ ముఖానికి వైద్యులు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. నుదిటికి చిన్నపాటి ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. అదృష్టవశాత్తు మెదడు, వెన్నుకు ఎలాంటి గాయాలు లేవని ఎంఆర్ఐ స్కాన్ లో తేలినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ రోజు మరోసారి ఎంఆర్ఐ స్కాన్ చేయనున్నట్లు డాక్టర్లు తెలిపారు. రిషబ్ నుదురు, మోకాలు, వీపు, కుడి మణికట్టు, బొటనవేలుకి గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం పంత్ ను ఢిల్లీకి తరలించే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం కార్లో ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో రోడ్డుపై ఉన్న డివైడర్ ను రిషబ్ పంత్ మెర్సిడెస్ బెంజ్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ గాయపడ్డారు.