కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రి హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు సంచలన ఆరోపణలు చేశారు. తమ కుమార్తె హత్యాచార ఘటనలో ప్రధాన నిందితులను మమతా బెనర్జీ ప్రభుత్వం, సీబీఐ కాపాడుతున్నాయని.. కవచంగా ఉన్నాయని తీవ్రంగా ఆరోపించారు. ప్రధాన సూత్రదారులను రక్షించే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. నేరస్తులను గుర్తించడంలో సీబీఐ విఫలమైందని ధ్వజమెత్తారు. కోల్‌కతా పోలీసులు, ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్, తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు.. జరిగిన ఘోరాన్ని కప్పిపెట్టేశారన్నారు. నిజం ఎప్పటికీ బయటకు రాకుండా చూస్తుకున్నారని బాధితురాలి తల్లి బెంగాల్ స్థానిక మీడియాతో వాపోయింది. నేరస్థలాన్ని ఎందుకు సీల్ చేయలేదని.. అలాగే అనేక మంది ప్రత్యక్ష సాక్షులను ఎందుకు తారుమారు చేశారని నిలదీశారు. సంఘటన జరిగిన రోజు నిఘా ఫుటేజీలో 68 మంది వ్యక్తులు ఉన్నట్లు చూపించారని.. చివరికి సంజయ్ రాయ్ ఒక్కడినే నేరస్తుడిగా గుర్తించారని ఆమె ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ICC T20: ఐసీసీ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు
ఆర్‌జీ కర్ ఆస్పత్రి ఘటనపై కోల్‌కతా పోలీసులు గానీ.. సీబీఐ గానీ సరైన దర్యాప్తు చేయలేదని బాధితురాలి తండ్రి ఆవేదన చెందారు. నేరాన్ని కప్పిపుచ్చేందుకు పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. రాజకీయ ప్రేరేపణ కారణంగానే జరిగిన ఘోరం సద్దుమణిగిపోయిందన్నారు. చివరికి న్యాయం అసంతృప్తిగా మిగిలిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే బాధితురాలి తల్లిదండ్రుల ఆరోపణలను టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ ఖండించారు. పార్టీని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిష్టను దిగజార్చేందుకు శక్తులు పని చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్‌జీ కర్ ఘటనపై ముఖ్యమంత్రి మమత సీరియస్ ఆదేశాలు ఇచ్చారని.. ఆమె చొరవతోనే కొద్దిరోజుల్లోనే నిందితుడికి శిక్ష పడిందని తెలిపారు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.
ఆగస్టు 9, 2024న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. అనంతరం సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇటీవల నిందితుడికి కోల్‌కతా కోర్టు.. జీవితఖైదు విధించింది. అయితే ఈ తీర్పుపై విమర్శలు వెల్తువెత్తాయి. నిందితుడికి మరణశిక్ష విధించాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇక సీబీఐ కూడా కోల్‌కతా హైకోర్టులో కూడా పిటిషన్ వేసింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని కోరింది.
ఇది కూడా చదవండి: Kolusu Partha Sarathy: అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం..