Crime: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్య సంచలన ఆరోపణలు చేశారు. సవతి కొడుకు, అతని సహాయకుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. 40 ఏళ్ల మహిళ తన భర్త కుటుంబం కట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపించింది. ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్‌కి చెందిన మహిళ, స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని తన ఇంట్లో తనపై అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
తనను ఇంట్లో బందీగా ఉంచారని, తన భర్త, సవతి కుమారుడిపై ఎలాంటి ఫిర్యాదు చేయనని లిఖితపూర్వక హామీ ఇచ్చిన తర్వాతే తనను విడిచిపెట్టారని చెప్పింది. అనాథ అయిన సదరు మహిళను 2020లో జమ్మూ కాశ్మీర్ కేడర్‌కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని వివాహం చేసుకుంది. తన భర్త మొదటి భార్య, అతని కొడుకు, కూతురు, ఇతర కుటుంబ సభ్యులు తనను కట్నం కోసం వేధించేవారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
Read Also: Tilapia Fish: తిలాపియా చేప వివాదం.. క్యాన్సర్ పుకార్లపై మమతా బెనర్జీ..
ఏళ్లు గడిచే కొద్దీ వేధింపులు ఎక్కువయ్యాయని, తనను ఏప్రిల్ 11-14 వరకు ఒక గదిలో బందీగా ఉంచారని, ఆహారం కూడా అందించలేదని చెప్పింది. తన భర్త కుమారుడు తన మొబైల్ ఫోన్ లాక్కున్నాడని, ఆ తర్వాత అతను, అతని సహాయకుడు తనపై అత్యాచారం చేశారని మహిళ ఆరోపించింది. చాలా రోజులు వేడుకున్న తర్వాత తనను విడుదల చేయడానికి వారు అంగీకరించారని చెప్పింది. బాధిత మహిళను లక్నోకి తీసుకెళ్లి, ఈ విషయాన్ని పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారని చెప్పింది. ఈ కేసుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్త్‌జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అభిజిత్ శంకర్ తెలిపారు.