Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు బంగ్లాదేశీ అయిన వ్యక్తిని పోలీసులు థానేలో అరెస్ట్ చేశారు. గత గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి దొంగతనం కోసం ప్రవేశించిన, మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే దుండగుడు, సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయనకు ఆరు చోట్ల గాయాలయ్యాయి. వెంటనే లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. సైఫ్ వెన్నెముకలో కత్తి విరిగి ఉండటంతో దానిని తీయడానికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కొలుకున్నారు.
అయితే, ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయివస్తున్న విధానంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి, ఆరోగ్యంగా కనిపించడంపై పలువురు కీలక వ్యాఖ్యలు చేశారు. సైఫ్ అలీ ఖాన్ వ్యవహారంపై మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణా మాట్లాడుతూ.. ‘‘ఈ సంఘటన నిజామా లేదా, ఆయన నటిస్తున్నారా..?’’ అని అనుమానించారు. అతను డిశ్చార్జ్ అయిన తర్వాత చూసినప్పుడు, అతడిపై నిజంగా కత్తి దాడి జరిగిందా..? అనే అనుమానం వచ్చినట్లు చెప్పారు.
ఒక ‘‘ఖాన్’’ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష నాయకులు నటుడి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి మద్దతుగా ఎన్సీపీ నేత జితేంద్ర అవాద్, ఎంపీ సుప్రియా సూలేలు ఎందుకు రాలేదని అడిగారు. షారూఖ్ ఖాన్ కుమారుడి గురించి నవాబ్ మాలిక్, సైఫ్ అలీ ఖాన్ గురించి సుప్రియా సూలే ఆందోళన చెందుతున్నారని, హిందూ నటుడు గురించి ఎప్పుడైనా ఆందోళన చెందారా..? అని అడిగారు.