Ram Mandir: అయోధ్య ‘ప్రాణప్రతిష్ట’ కార్యక్రమంలో కీలక ఘట్టం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం రామ్ లల్లా విగ్రహాన్ని రామ మందిరానికి తీసుకువచ్చారు. క్రేన్ సాయంతో గర్భగుడి వద్దకు చేర్చారు. ఈ రోజు గర్భగుడిలో రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. బుధవారం సాయంత్రం భక్తుల ‘జై శ్రీరామ్’ నినాదాలు హోరెత్తుతుండగా.. రాముడి విగ్రహం ఆలయానికి చేరుకుంది.
Read Also: Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు.. నాకు టికెట్ రాకపోతే పనిచేయను..!
బాల రాముడికి పూజలు:
గురువారం మధ్యామ్నం 1.20 గంటలకు సంకల్ప కార్యక్రమం జరగనుంది. ఆ తర్వాత గణేశాంబికాపూజ, వరుణ పూజ, చతుర్వేదోక్త పుణ్యాహ్వచనం, మాతృకాపూజ, వసోర్ధర పూజ (సప్త ఘృత్ మాతృకా పూజ), ఆయుష్య మంత్ర జపం, ఆచార్యాదిచత్విగ్వరణ్, మధుపర్క పూజ, మండప ప్రవేశం కార్యక్రమాలు జరగనున్నాయి. పృథ్వీ కూర్మ అనంత వరాహ యజ్ఞభూమి పూజ, దిగ్రక్షణ పంచగవ్య-ప్రోక్షణ, మండపాంగ వాస్తు పూజ, మండప సూత్రవేష్టనం, పాలు, నీటితో అభిషేకం, షోడశస్తంభ పూజ మొదలైన పూజలు, వీటితో పాటు మండప పూజ (తోరణం, ద్వారం, ధ్వజం, ఆయుధాలు, జెండా, దిక్పాలకులు, ద్వార పాలకులకు పూజలు) నిర్వహించనున్నారు. బాల రాముడి విగ్రహానికి జలాధివాసం, గంధాదివాసం, సాయంత్రం ఆరాధన వీటి తర్వాత హారతి కార్యక్రమాలు ఉన్నాయి.
ఈ నెల 22న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతున్నారు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖులు, సాధువులతో సహా 7000 మంది అతిథులు వస్తున్నారు. దీంతో అయోధ్య మొత్తం పండగ వాతావరణం నెలకొంది. దీనికి తగ్గట్లుగానే యూపీ సర్కార్ అయోధ్య వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది.