Raj Thackeray: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు, ఎన్సీపీ సంక్షోభంపై మహరాష్ట్ర నవనిర్మాణ్ సేవ(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాల వెనక ఎన్సీపీ నేత శరద్ పవార్ హస్తం ఉండవచ్చని అన్నారు. బీజేపీ-శివసేన(ఏక్ నాథ్ షిండే) ప్రభుత్వంలో ఎన్సీపీ చేరడం, ఎన్సీపీలో చీలిక రావడం తదితర పరిణామాల గురించి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చాలా అసహ్యంగా ఉన్నాయని.. ఇది రాష్ట్ర ఓటర్లను అవమానించడం తప్ప మరొకటి కాదని ఠాక్రే అన్నారు.
Read Also: MLA Raghunandan Rao: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అరెస్ట్.. కారణం ఇదే..
మొదటగా శరద్ పవార్ మహారాష్ట్రలో ఇటువంటి రాజకీయాలు ప్రారంభించారని.. పురోగామి లోక్ షాహి దళ్ ప్రభుత్వంతో 1978లో ఇలాంటి ప్రయోగాలే చేశారని.. మహారాష్ట్రలో అంతకుముందు ఇలాంటి పరిణామాలు చూడలేదని.. శరద్ పవార్ తోనే ప్రారంభమయ్యాయి, శరద్ పవార్ తోనే ముగుస్తున్నాయని ఠాక్రే అన్నారు. ఇటీవల పరిణామాల వెనక శరద్ పవార్ హస్తం ఉందని ఆరోపించారు. ప్రఫుల్ పటేల్, దిలీప్ వార్సే పాటిల్, ఛగన్ భుజ్‌బల్, అజిత్ పవార్ వంటి నేతలు శరద్ పవార్ ఆశీస్సులు లేకుండా వెళ్లే వారు కాదని ఆయన అన్నారు.
గత ఆదివారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చీలిక ఏర్పడింది. పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ తిరుగుబాటు లేవనెత్తారు. అజిత్ పవార్ తో సహా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమిలో చేరి బీజేపీతో జతకట్టారు. ఆదివారం అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రభుత్వంలో చేరారు. శరద్ పవార్ కు అత్యంత సన్నిహితులు కూడా అజిత్ పవార్ వెంట నడిచారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉంటే 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు అజిత్ పవార్ వర్గం చెబుతోంది. ఇదిలా ఉంటే బుధవారం రెండు వర్గాలు ముంబై వేదికగా బలనిరూపణ చేసుకోబోతున్నాయి.