Rahul Gandhi: మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా బీజేపీ చెబుతున్నా 400 సీట్లు సాధ్యమా..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 400 సీట్లు సాధించేందుకు ప్రధాని ‘అంపైర్లను’ ఎంచుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్‌కి వ్యతిరేకంగా ఈ రోజు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే, మల్లికార్జున ఖర్గే, కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్, హేమంత్ సొరెన్ భార్య కల్పనా సొరెన్ హాజరయ్యారు.
ఢిల్లీలో నిర్వహించిన ‘లోక్‌తంత్ర బచావో’ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, మీడియాపై ఒత్తిడి లేకుండా వారు(బీజేపీ) 180 సీట్ల కంటే ఎక్కువ గెలవలేరని అన్నారు. ‘‘ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి. అంపైర్లను ఒత్తిడి చేసి, ఆటగాళ్లను కొనుగోలు చేసి, కెప్టెన్లను బెదిరించి మ్యాచుల గెలవడాన్ని క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. మన ముందు లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి, అంపైర్లను ప్రధాని మోడీ ఎన్నుకున్నారు. మ్యాచ్‌కి ముందే మా జట్టు ఆటగాళ్లను ఇద్దర్ని అరెస్ట్ చేశారు’ అని కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌ల గురించి రాహుల్ గాంధీ అన్నారు.
Read Also: Mamata Banerjee: 400 సీట్లు కాదు, కనీసం 200 గెలిచి చూపించాలి.. బీజేపీకి మమతా సవాల్..
‘‘కాంగ్రెస్ అతిపెద్ద ప్రతిపక్షం, ఎన్నికల మధ్యలో మా బ్యాంకు ఖాతాలన్నీ మూసివేయబడ్డాయి. మేము ప్రచారాలు నిర్వహించాలి, కార్యకర్తలను రాష్ట్రాలకు పంపాలి, పోస్టరు వేయాలి, కానీ మా బ్యాంకు ఖాతాలన్ని మూసివేయబడ్డాయి. ఇవి ఎలాంటి ఎన్నికలు..?’’ అని ప్రశ్నించారు. పేదల నుంచి రాజ్యాంగం లాక్కోవడానికి ప్రధాని 3-4 మంది క్రోనీ క్యాపిటలిస్టలు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారని ఆరోపించారు.
‘‘ఈ ఎన్నికలు సాధారణం కాదు, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు పూర్తిస్థాయిలో ఓటేయకపోతే వారి ఫిక్సింగ్ ఫలిస్తుంది. ఇదే జరిగితే రాజ్యాంగం ధ్వంసమవుతుంది. రాజ్యాంగం ప్రజల గొంతుక. ఆ రోజు దేశం అంతమవుతుంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు. 400 సీట్లు వస్తే దేశ రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ ఎంపీ ఒకరు చెప్పారని, ఇది వారి ఆలోచన అని బీజేపీని దుయ్యబట్టారు.