త్వరలోనే రాష్ట్రపతి ఎన్నిక, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ విదేశీ పర్యటనకు వెళ్లారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఐరోపాకు వెళ్లినట్లు సమాచారం. మళ్లీ ఆదివారం తిరిగిరానున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.దేశంలో కీలక పరిణామాలు, సమావేశాల సమయంలోనే ఆయన విదేశాలకు వెళ్లడంపై ఇప్పటికే అనేక సార్లు విమర్శలు కూడా వచ్చాయి. అయినా సరే అదే తరహాలో ఈసారి విదేశాలకు వెళ్లడంతో మరోసారి విమర్శలకు దారితీసింది. ప్రత్యేకించి కాంగ్రెస్ గత కొన్నేళ్లుగా వరుస నష్టాలతో కుంగిపోతోంది.ఈ సమయంలో పార్టీని బలోపేతం చేసే దిశగా పునర్నిర్మించాలని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు.ఇటీవల మహారాష్ట్రలో ఎంవీఏ సర్కారు కూడా కూలిపోయింది. గోవాలో కూడా ఫిరాయింపులు చోటుచేసుకుంటున్నాయి.ప్రస్తుతానికి కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను కాపాడుకున్నట్లు కనిపిస్తున్నా.. వారంతా భాజపాతో టచ్‌లోనే ఉన్నారని తెలుస్తోంది.మరోవైపు కీలకమైన రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది.
పార్టీ తన సొంత అధ్యక్ష ఎన్నికల గురించి కూడా గురువారం పార్టీ సమావేశం కానుంది. రాహుల్ గాంధీ ఆ సమావేశానికి దూరంగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన రాహుల్‌గాంధీ రాజీనామా చేయడంతో ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సోనియా గాంధీ నిర్వహిస్తున్నారు. రాహుల్ గాంధీ ఈ పదవికి పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.గురువారం నాటి పార్టీ సమావేశంలో అక్టోబరు 2న ప్రారంభం కానున్న ‘భారత్ జోడో యాత్ర’ లేదా ఐక్య భారత ప్రచారానికి సంబంధించిన ప్రణాళికలపై కూడా చర్చించనున్నారు.రాహుల్ గాంధీ సమావేశానికి హాజరుకాకపోవడం అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఆయన ఎంత నిబద్ధతతో ఉన్నారనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకి జగన్ సపోర్ట్
కొద్దినెలల క్రితం పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న తర్వాత రాహుల్ చేసిన విదేశీ పర్యటన వైరల్ అయిన సంగతి తెలిసిందే. బీజేపీ మద్దతుదారులు చిత్రాలను విడుదల చేశారు. అయితే జర్నలిస్టు వివాహానికి వ్యక్తిగతంగా సందర్శించడంలో తప్పు లేదని కాంగ్రెస్ పేర్కొంది. ఆ సమయంలో రాహుల్ గాంధీ యూరప్‌లో పర్యటించారు. ఆ ఎన్నికలకు ముందు డిసెంబర్‌లో ఇటలీకి వెళ్లడం గమనార్హం.