Rahul Gandhi comments on congress president post: కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. ఇదిలా ఉంటే తాను అధ్యక్ష రేసులో లేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని ఎప్పుడో చెప్పానని.. దాంట్లో మార్పు ఉండదని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కేవలం పదవి మాత్రమే కాదని.. అది దేశాన్ని ప్రాతినిధ్యం వహించడం అని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కేవలం సంస్థాగతమైన పదవి కాదని.. అది విశ్వాసం, ఒక భావజాలాన్ని, దేశ దృక్కోణాన్ని ఆవిష్కరిస్తుందని.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వారెవరైనా వీటిని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. విశ్వాస వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే సైద్ధాంతిక పదవని ఆయన అన్నారు.
ఇక కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు దాదాపుగా ఖరారైనట్లే కనిపిస్తోంది. రెండు పదవులపై సీఎం అశోక్ గెహ్లాట్ పెట్టుకున్న ఆశలపై రాహుల్ గాంధీ నీళ్లు చల్లారు. ఉదయ్‌పూర్ శింతన్ శిబిర్ లో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ అనే సిద్ధాంతానికి మద్దతు ఇచ్చామని.. ఇది కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు రాహుల్ గాంధీ కేరళలో చెప్పారు.
71 ఏళ్ల అశోక్ గెహ్లాట్ ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే అతను ముఖ్యమంత్రి పదవిని వదులుకునేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. తాను అధ్యక్ష పీఠంపై కూర్చుంటే.. సచిన్ పైలెట్ సీఎం అవుతారని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన ఇటు అధ్యక్షుడిగా, అటు రాజస్థాన్ సీఎంగా ఉండేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో అశోక్ గెహ్లాట్ ఇక సీఎం పదవిని వదులకోవాల్సిందే అనే స్ఫష్టత వచ్చింది.