Gymkhana Stadium: జింఖానా మైదానంలో తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. HCA ప్రెసిడెంట్ అజహరుద్దీన్ సహా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మధ్యాహ్నం 3 గంటలకు తన కార్యాలయానికి రావాలని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. టికెట్ల విక్రయాలపై పూర్తి సమాచారంతో రావాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు HCAకు నోటీసులిచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు.
జింఖానా గ్రౌండ్ లో టికెట్ల పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయని HCAపై చర్యలకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమవుతున్నారు. 30 వేల మందికి పైగా అభిమానులు వస్తే కేవలం 4 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. సరైన నిర్వహణా ఏర్పాట్లు చేయకపోవడంతో పాటు ఎంతమంది వస్తారనేది స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జింఖానా మైదానంలో క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం తొక్కిసలాటలో గాయపడి, స్పృహ కోల్పోయిన ఓ మహిళ ప్రాణాలు రక్షించేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. ఓ లేడీ కానిస్టేబుల్ నోటి ద్వారా ఆమెకు శ్వాస అందిస్తూ బతికించే ప్రయత్నం చేసింది. సీపీఆర్ కూడా చేశారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు.
Read also: Sajjala Ramakrishna Reddy: ఎన్టీఆర్ అంటే మాకు ఎనలేని గౌరవం
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటకు HCA నిర్వహణా వైఫల్యం కారణమని విమర్శలు వస్తున్నాయి. టికెట్లు ఇచ్చే జింఖానా గ్రౌండ్ లో 4 కౌంటర్లు ఉండగా మహిళల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయలేదు. దీంతో గ్రౌండ్ గేట్లు తెరవగానే పురుషులతో పాటు మహిళలూ లోపలికి పరిగెత్తి ఒకే లైన్లో నిలబడగా తోపులాట జరిగింది. INDvSAUS మూడవ టీ20 మ్యాచ్ హైదరాబాద్ లో జరుగుతుందని ముందే ప్రకటించినా.. టికెట్ల జారీలో ఎందుకీ గందరగోళం. ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూశారు. మూడు రోజులుగా జింఖానా గ్రౌండ్ వద్దే నిరీక్షించినా.. టికెట్లు దేవుడెరుగు.. పోలీసుల లాఠీ దెబ్బలు రుచిచూడాల్సి వచ్చింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ప్రతిఫలం ఇదేనా అంటూ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ట్విటర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు.
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం జింఖానా గ్రౌండ్లో టికెట్ల అమ్మకంలో తొక్కిసలాట జరగడంతో టికెట్ల కౌంటర్లను HCA తాత్కాలికంగా మూసేసింది. పరిస్థితి సద్దుమణిగాక తిరిగి విక్రయం ప్రారంభిస్తారని తెలుస్తోంది. 30 వేల మందికి పైగా అభిమానులు రాగా కేవలం 4 కౌంటర్లే ఏర్పాటు చేశారు. గేట్లు తెరవగానే ఒక్కసారిగా అంతా లోపలికి దూసుకురావడంతో తొక్కిసలాట, లాఠీఛార్జ్ జరిగి పదుల సంఖ్యలో గాయపడ్డారు. చాలా మందికి కాళ్లు, చేతులు విరిగినట్లు తెలుస్తోంది. ఎవరూ చనిపోలేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.